ఉద్యోగాల పేరిట మోసం..
మహబూబాబాద్ రూరల్ : కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పి పలువురి నిరుద్యోగ యువతీయువకుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతీయువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. తనకున్న పరిచయాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సుమారు 25 మంది యువతీయువకుల్లో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు డబ్బులు వసూలు చేశాడు. అనంతరం అతడు ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గల ప్రభుత్వ విద్యాసంస్థల్లో జాయిన్ అయ్యేందుకు వెళ్లారు. తీరా అక్కడికెళ్లి ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలను అడిగితే అవి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలని ధ్రువీకరించారు. దీనిపై బాధితులు.. నియామక పత్రాలు అందజేసిన వ్యక్తిని అడగగా అతడు స్పందించలేదు. దీంతో ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలని మహబూబాబాద్ టౌన్ పోలీసులను ఆశ్రయించనున్నట్లు సమాచారం.
నిరుద్యోగుల వద్ద నుంచి డబ్బుల వసూళ్లు..
నకిలీ నియామక పత్రాల అందజేత
Comments
Please login to add a commentAdd a comment