డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫలితాల విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది నవంబర్–డిసెంబర్‌లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ, బీ ఒకేషనల్ కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 70,661మంది విద్యార్థులకు 15,495 మంది ఉత్తీర్ణత (21.93శాతం) సాధించారు. మూడో సెమిస్టర్ పరీక్షల్లో 59,916 మంది పరీక్షలు రాయగా అందులో17,356 మంది విద్యార్థులు ఉత్తీర్ణత (28.97శాతం) సాధించారు. ఐదో సెమిస్టర్ పరీక్షల్లో 46,828 మంది పరీక్షలకు హాజరుకాగా అందులో 19,074 మంది ఉత్తీర్ణత (40.73శాతం) సాధించారని పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ తెలిపారు. పూర్తి వివరాలే కేయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు ఎం. తిరుమలాదేవి, వెంకటయ్య, కేయూ పాలకమండలి సభ్యులు బి. సురేశ్‌లాల్, చిర్రరాజు, ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామా వెంకటేశ్వర్లు, క్యాంపు ఆఫీసర్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment