కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ బీఎస్సీ, బీసీఏ బీ ఒకేషనల్ కోర్సులకు సంబంఽధించి మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను ఈ నెల 4న రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ డీన్ అకడమిక్‌కు ఫీజులు చెల్లించకపోవడంతో ఆయా కళాశాలల పరీక్షల ఫలితాలను , యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు నిలిపివేశారు. యూనివర్సిటీ పరిధిలో 304 (ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ గురుకుల) కళాశాలలు ఉన్నాయి. అందులో 121 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు వివిధ రకాల ఫీజులు చెల్లించాల్సింటుంది. కానీ, ఫీజులు చెల్లించకపోవడంతో వాటి ఫలితాలను యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు నిలిపివేశారు. దీంతో విద్యార్థులకు ఫలితాలు తెలియక ఆందోళన చెందుతున్నారు. కొన్ని కాలేజీలకు వచ్చి మరికొన్నింటికి రాకపోవడేమంటని ఆరా తీస్తున్నారు.
ఇప్పటికే సమయమిచ్చిన వర్సిటీ అధికారులు
కాకతీయ యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్, స్టూడెంట్ రికగ్నిషన్ ఫీజు, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఫీజు కలిపి చెల్లించాల్సింటుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా ఫీజులు కట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎక్కువమంది ఉన్న కళాశాలలు రూ.లక్షల్లోనే చెల్లించాల్సింటుంది. డిగ్రీకోర్సుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు గత ఏడాది డిసెంబర్‌లో మొదలయ్యే సమయంలో ఆయా ఫీజులు చెల్లించాల్సిండగా, అప్పట్లో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ల బాధ్యులు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిని, అప్పటి రిజిస్ట్రార్ మల్లారెడ్డిని కలిశారు. తమ కళాశాలలకు ప్రభుత్వం రెండుమూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలేదని, ఆర్థిక ఇబ్బందులున్నాయని, ఫీజులు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ఇందుకు తొలుత అంగీకరించకపోయినా ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో వీసీ, రిజిస్ట్రార్ అంగీకరించారు. 15 నుంచి 20 రోజుల వరకు సమయం ఇచ్చారు. పరీక్షలు పూర్తయ్యాక కూడా కొద్దిరోజుల క్రితం జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తికావొచ్చినప్పడు యూనివర్సిటీ అకడమిక్ డీన్ ఆయా కళాశాలలకు ఫీజులు చెల్లించాలని నోటీస్‌లు పంపారు. కొన్నికళాశాలల యాజమాన్యాలు చెల్లించగా, 121 ప్రైవేట్ కళాశాలలు బుధవారం వరకు ఫీజులు చెల్లించలేదు. ఫీజులు చెల్లించిన వాటి ఫలితాలు వెబ్‌సైట్ ఉంచి, చెల్లించని వారివి నిలిపివేశారు.
ఫీజులు చెల్లిస్తేనే ఫలితాలు
కాకతీయ యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు ఫీజులు చెల్లించినట్లు క్లియరెన్స్ వస్తేనే ఫలితాలు వెల్లడిస్తాం. ఫీజులు చెల్లించకపోతే ఫలితాలను వెల్లడించే ప్రసక్తి లేదు.
ప్రొఫెసర్ రాజేందర్,
పరీక్షల నియంత్రణాధికారి, కేయూ
ఆందోళన చెందుతున్న విద్యార్థులు
తమ ఫలితాలు చూసుకునే వీలులేకపోవడంతో ఆయా కళాశాలల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కళాశాలలకు వెళ్లి ఫలితాలు కనిపించడం లేదని ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ ప్రైవేట్ కళాశాలల యాజామాన్యాల అసోసియేషన్ బాధ్యులు బుధవారం రిజిస్ట్రార్ రామచంద్రాన్ని కలిసి.. ఫలితాలు వెల్లడించాలని విన్నవించారు. తాను వీసీ దృష్టికి తీసుకెళ్లాక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారని సమాచారం.
కేయూ డీన్ అకడమిక్‌కు ఫీజులు
చెల్లించని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు
నోటీసులకు యాజమాన్యాల నో రెస్పాన్స్
Comments
Please login to add a commentAdd a comment