పెళ్లింట తీవ్ర విషాదం..
● కొడుకు పెళ్లైన రెండో రోజే బ్రెయిన్ స్ట్రోక్‌తో తండ్రి మృతి
● సుందరయ్య కాలనీ గ్రామంలో ఘటన
వాజేడు : బంధువులు, అతిథుల మధ్య అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి జరిపించాడు. పెళ్లింటి నుంచి సొంతింటికి వచ్చి వ్రతం చేసుకుంటున్నారు. అంతలోనే బంధువులతో కళకళలాడుతున్న ఆ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్రెయిన్ స్ట్రోక్‌తో పెళ్లి కొడుకు తండ్రి మృతి చెందాడు. ఈ ఘటనతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని సుందరయ్య కాలనీ గ్రామానికి చెందిన అక్కిసెట్టి ఏసుబాబు(48)కి భార్య కుమారి, ఇద్దరు కుమారులు హరికృష్ణ, శివ కృష్ణ ఉన్నారు. పెద్ద కొడుకు హరికృష్ణకు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన యువతితో సోమవారం(మార్చి 3) పెళ్లి జరిపించాడు. అనంతరం వధూవరులను తీసుకుని తమ ఇంటికి వచ్చాడు. మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తున్నాడు. అదే సమయంలో తనకు అలసటగా ఉందని, వ్రతంలో కూర్చో లేనని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కొత్త జంటతో పాటు వరుడి తల్లి వ్రతంలో కూర్చున్నారు. ఈ క్రమంలో ఏసుబాబు కాళ్లు, చేతులు లాక్కురావడం చూసిన బంధువులు వెంటనే ఆర్‌ఎంపీతో పరీక్షించగా బీపీ పెరిగినట్లు తెలిపి వెంటనే మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని చెప్పాడు. దీంతో ఏటూరు నాగారం తీసుకు వెళ్లగా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వరంగల్ తీసుకెళ్లాలని అక్కడి ప్రైవేట్ వైద్యుడు తెలుపగా వెంటనే వరంగల్ ఎంజీఎం తరలించారు. వైద్యం చేస్తుండగా బుధవారం మృతి చెందాడు. దీంతో కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు.
పెళ్లింట తీవ్ర విషాదం..
Comments
Please login to add a commentAdd a comment