బియ్యం రాలే..!
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం పేదలకు ప్రతీ నెల అందించే రేషన్ బియ్యం ఈనెల ఆలస్యం అవుతుంది. నెల చివర వరకు డీలర్ పాయింట్లకు రావాల్సిన బియ్యం ఇంకా మండల్ లేవల్ స్టాక్ పాయింట్లకే చేరలేదు. ఉగాది నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తామని ప్రజాప్రతినిధులు చెప్పడంతో ఈ సారి సన్న బియ్యం తెచ్చుకుందామని డీలర్ల వద్దకు వెళ్తే సన్న బియ్యం కాదు కదా.. దొడ్డు బియ్యం కూడా రాలేదని డీలర్లు చెప్పడంతో షాపుల వద్దకు వెళ్లిన నిరుపేదలు నిరాశగా వెనుదిరి వస్తున్నారు. బియ్యం రాకపోవడంతో అధిక ధర పెట్టి షాపుల వద్ద నుంచి కొనుగోలు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో బియ్యం సరఫరా ఇలా..
దేశంలో ఎవరూ కూడా ఆకలితో చావకూడదని చేసిన ఆహార భద్రతా చట్టం ప్రకారం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ప్రతీ నెల రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇలా జిల్లాలోని 556 రేషన్ షాపుల ద్వారా ప్రతీ 2,26,047 ఆహార భద్రత కార్డుల్లోని 6,76,864 మందికి నెలకు 4,061 టన్నులు, 15,300 మంది అంత్యోదయ కార్డులు ఉన్నవారికి కార్డుకు నెలకు 35 కిలోల చొప్పున 751.480 టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే ఈనెల డీలర్లు తీసిని ఆర్‌ఓల ప్రకారం 3,312 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా చేయాలి. కానీ ఇప్పటి వరకు 151 రేషన్ షాపులకు 895 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు.
గోదాముల్లో నిండుకున్న దొడ్డు బియ్యం
పేదలకు సరఫరా చేసే రేషన్ బియ్యం కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం మిల్లింగ్ చేయించి జిల్లాలోని మహబూబాబాద్, అనంతారం, కేసముద్రం, నెల్లికుదురు, నెక్కొండ ప్రాంతాల్లో ఉన్న బఫర్ గోదాముల్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, కొత్తగూడ ప్రాంతాల్లో ఉన్న ఎంఎల్‌ఎస్ పాయింట్లకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి నెల చివరలో డీలర్ల వద్దకు సరఫరా చేస్తారు. అయితే గతంలో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకున్న కొన్ని మిల్లులు ఇప్పటి వరకు సీఎంఆర్ పెట్టలేదు. అదేవిధంగా మార్చి నుంచి సన్న బియ్యం సరఫరా చేయాల్సి వస్తుందని దొడ్డు బియ్యం నిల్వ పెట్టుకోలేదు. దీంతో బఫర్ గోదాములు, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఉన్న కొద్దిపాటి బియ్యం డీలర్ పాయింట్లకు పంపించి అధికారులు చేతులు దులుపుకున్నారు.
వారం రోజుల్లో సరఫరా పూర్తి చేస్తాం
జిల్లాలో ఎంఎల్‌ఎస్ పాయింట్లలోని దొడ్డు బియ్యం కొన్ని రేషన్ షాపులకు సరఫరా చేశాం. మిగిలిన షాపులకు వారం రోజుల్లో సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. గత ఖరీఫ్‌లో కొనుగోలు చేసిన దొడ్డురకం ధాన్యం సీఎంఆర్ వేగంగా చేయాలని మిల్లర్లకు చెప్పాం.
– వీరబ్రహ్మచారి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ
వారం రోజులు దాటినా..
జిల్లాలోని 556 డీలర్ షాపులు ఉండగా గోదాముల్లో దొడ్డురకం బియ్యం నిల్వలు తక్కువగా ఉండటంతో వంద షాపులకే బియ్యం సరఫరా చేశారని, వాటికి కూడా పూర్తిగా ఇవ్వలేదని తెలిసింది. దీంతో సగం మందికి రేషన్ ఇచ్చి... సగం మందికి ఇవ్వకపోతే. లబ్ధిదారులతో ఇబ్బంది అవుతుందని స్టాక్ తీసుకెళ్లిన డీలర్లలో కొందరు పంపిణీ చేయడం లేదు. దీంతో ప్రతీ నెల ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం ఈ నెల వారం రోజులు దాటినా పంపిణీ చేయడం లేదు. దొడ్డు బియ్యం లేకుండా నిండుకున్న బఫర్ గోదాములకు, అక్కడి నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి డీలర్ల వద్దకు ఎప్పుడు బియ్యం వస్తాయో.. ఏమో అనే విషయంపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు.
నేటికి డీలర్లకు చేరని రేషన్ బియ్యం
బఫర్ గోదాముల్లో
నిండుకున్న దొడ్డు రకం
సన్న బియ్యం పంపిణీపై రాని స్పష్టత
ప్రారంభంకాని పంపిణీ
రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్న పేదలు
జిల్లాలోని రేషన్ కార్డులు :
2,26,047
మొత్తం రేషన్ షాపులు: 556
నెలవారీగా సరఫరా చేసే రేషన్ బియ్యం: 3,312 మెట్రిక్ టన్నులు
ఇప్పటి వరకు డీలర్ పాయింట్‌కు వెళ్లిన బియ్యం : 895 మెట్రిక్ టన్నులు
సరఫరా చేయాల్సిన బియ్యం :
2,417 మెట్రిక్ టన్నులు
బియ్యం రాలే..!
Comments
Please login to add a commentAdd a comment