డ్రైవర్ నిర్లక్ష్యం..ట్రాలీ బోల్తా
చెన్నారావుపేట : డ్రైవర్ నిర్లక్ష్యంతో ట్రాలీ వాహనం బోల్తాపడిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురం శివారులో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని జీడిగడ్డ తండాకు చెందిన 37 మంది వ్యవసాయ కూలీలను ఇటుకాలపల్లి శివారు ఇప్పల్ తండాకు చెందిన ధరావత్ మైబూ మిర్చి ఏరేందుకు కూలీలను తీసుకు రమ్మని జీడిగడ్డ తండాకు చెందిన భూక్య సమ్మికి చెప్పాడు. బానోత్ సుక్యతో పాటు 37 మందిని కూలీలను తీసుకోని గూడ్స్ వాహనంలో గురువారం ఉదయం ఇప్పల్ తండాకు బయలుదేరారు. గార్లగడ్డ తండాకు చెందిన ట్రాలీ డ్రైవర్ అజ్మీరా సంతోష్ వాహనాన్ని అతివేగంగా నడపడంతో పాటు ఎక్కువ మంది ఉండడం వల్ల కోనాపురం శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న 37 మంది కూలీలు కింద పడ్డారు. అందులో కొందరికి తీవ్రగాయాలు, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోతరాజు రాజు, పున్నం నర్సయ్య వెంటనే 108తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజేష్‌రెడ్డిలు చేరుకుని క్షతగాత్రులను నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో బానోత్ సుక్య (55) మృతిచెందాడు. బానోత్ ఈర్య, ఆంగోత్ జమ్లి, నూనావత్ అంబాలి, బానోత్ బుజ్జి, సంపుతోపాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఎంజీఎంకు తరలించారు. మృతుడి కుమారుడి మోహన్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్‌రెడ్డి తెలిపారు.
తప్పిన పెను ప్రమాదం..
వాహనం బోల్తా పడిన ప్రదేశంలో పెద్ద బండరాయి ఉంది. ఒకవేళ వాహనం బండరాయి పై పడి ఉంటే
మరికొందరు మృత్యువాత పడేవారని స్థానికులు చెబుతున్నారు.
వాహనంలో 37మంది కూలీలు
ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
కోనాపురం శివారులో ఘటన
బతికి బయట పడ్డా..
నర్సంపేట మండలం ఇప్పల్‌తండాకు చెందిన రైతు పంపిన వాహనంలోనే మిర్చి ఏరడానికి వెళ్లాను. వాహనం స్పీడ్‌గా వెళ్తుంది. ఒక్కసారి కోనాపురం శివారులో బోల్తా పడింది. కొద్దిసేపు ఏం జరిగిందో అర్థం కాలే. చాలా మందికి దెబ్బలు తగిలాయి. నాకు స్వల్పంగా గాయాలయ్యాయి.ఆ ప్రమాదం చూస్తే చనిపోయాననుకున్నా. దేవుడు మరో జన్మనిచ్చాడు.
– బానోత్ అరుణ, ట్రాలీలో ఉన్న కూలీ
కళ్ల ముందే బోల్తా పడింది..
కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడిన సమీపంలోనే నా వ్యవసాయ భూమి ఉంది. పంటకు నీళ్లు పెట్టి బయటికి వచ్చాను. చూస్తుండగానే అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. వెంటనే అక్కడికి వెళ్లి వాహనంలో ఉన్న వారి సాయంతో అందరిని బయటికి తీశాం. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది.
– పున్నం నర్సయ్య, ప్రత్యక్ష సాక్షి
డ్రైవర్ నిర్లక్ష్యం..ట్రాలీ బోల్తా
డ్రైవర్ నిర్లక్ష్యం..ట్రాలీ బోల్తా
డ్రైవర్ నిర్లక్ష్యం..ట్రాలీ బోల్తా
డ్రైవర్ నిర్లక్ష్యం..ట్రాలీ బోల్తా
Comments
Please login to add a commentAdd a comment