జోరుగా మిర్చి కొనుగోళ్లు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం 3,044 క్వింటాళ్ల (7,597 బస్తాలు) మిర్చి కొనుగోళ్లు జరిగినట్లు ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. 6,958 బస్తాల తేజ రకం మిర్చి, 639 బస్తాల తాలు రకం మిర్చి అమ్మకాలు జరిగినట్లు చెప్పారు. తేజ రకం క్వింటా గరిష్ట ధర రూ. 13,850, కనిష్ట ధర రూ.10,200 పలుకగా.. తాలు రకం మిర్చి క్వింటా గరిష్ట ధర రూ.6,350, కనిష్ట ధర రూ.4,820 పలికిందని పేర్కొన్నారు. మార్కెట్‌లో మిగిలిన మిర్చిని మంగళ, బుధవారాల్లో వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారని ఆయన తెలిపారు. కాగా బుధ, గురువారం వ్యవసాయ మార్కెట్‌కు రైతులు మిర్చిని తీసుకురావొద్దని కోరారు.
14, 15, 16 తేదీల్లో మార్కెట్ బంద్...
ఈనెల 14న హోలీ పండుగ, 15న శనివారం, 16న ఆదివారం వారాంతపు సెలవుల సందర్భంగా వ్యవసాయ మార్కెట్ బంద్ ఉంటుందని తెలిపారు. కాగా బుధవారం నుంచి ఆదివారం వరకు ఐదు రోజులపాటు మిర్చిని మార్కెట్ యార్డులోకి అనుమతించరని, రైతులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరారు. బుధ, గురువారా ల్లో మిర్చి కాకుండా మిగతా సరుకులను మార్కెట్ యార్డులోకి అనుమతి ఇస్తారని పేర్కొన్నారు.
11వేల బస్తాల రాక..
కేసముద్రం: జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మిర్చి బస్తాలు పోటెత్తాయి. ఈ సీజన్‌లో ఎన్నడూలేనంతగా 11వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. వ్యాపారులు ఆలస్యంగా టెండర్లు వేయగా, మధ్యాహ్నం 2 గంటలకు విన్నర్ జాబితా విడుదలైంది. సాయంత్రం వరకు 7వేల మిర్చి బస్తాలు కాంటాలు పెట్టారు. మిగిలిన 4వేల మిర్చి బస్తాల వద్ద రైతులు రాత్రంతా పడిగాపులు పడుతూ ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజు, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్‌రావుతో కలిసి మిర్చి యార్డును సందర్శించారు. కాగా తేజరకం మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ.13,599, కనిష్ట ధర రూ.10,010 పలుకగా, తాలురకం మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ. 6,511, కనిష్ట ధర రూ.4,009 పలికినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment