భళా.. ఇత్తడి హస్తకళ
సాక్షి, వరంగల్ : వరంగల్ జిల్లా రంగశాయిపేట ఇత్తడి హస్తకళకు దేశ రాజధానిలో ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. కాకతీయుల కాలం నాటి వెండి నగిషీలు తయారుచేసే పెంబర్తి హస్తకళకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉంటే.. వాటి సరసన రంగశాయిపేట ఇత్తడి హస్తకళ పోటీపడుతోంది. అమృత్ మహోత్సవ్‌లో భాగంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో బుధవారం నుంచి జరుగుతున్న దక్షిణ భారత ఎగ్జిబిషన్‌లో రంగశాయిపేట ఇత్తడి హస్తకళ స్టాల్‌కు చోటు లభించింది. ఓ వైపు సాంస్కృతిక ప్రతిరూపాలను తెలిపే డిజైన్లు, మరోవైపు నేటి కాలానికి తగ్గట్టుగా మోడ్రన్ డిజైన్ విత్ ఎంబోజింగ్ వర్క్ ద్వారా విభిన్న హస్తకళ డిజైన్లు చేస్తుండడంతో వీటికి ప్రత్యేక గుర్తింపు లభించింది. నాబార్డు, డీసీహెచ్ మద్దతుతో వందలాది కుటుంబాలకు ఈ హస్తకళ నైపుణ్యంపై శిక్షణ ఇచ్చి భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా రంగశాయిపేట ఇత్తడి హస్తకళ బంధం ముందుకెళ్తోంది. ‘రాగి లేదా ఇత్తడి లోహన్ని సన్నని షీట్లుగా కొట్టి, చక్కటి తీగగా కట్ చేస్తాం. చెక్క ఉపరితలంపై గుర్తించబడిన డిజైన్‌ను సుత్తి, ఉలి సాయంతో కోస్తాం. ఇత్తడి లేదా రాగి తీగను డిజైన్‌తో చెక్కబడిన భాగంలోకి సుత్తితో గుచ్చుతాం. ఆ తర్వాత రంపంతో కత్తిరించి డిజైన్‌లో కావల్సిన ప్రదేశాలలో జిగురుతో బిగిస్తాం. అత్యాధునిక పద్ధతులతో వివిధ డిజైన్లతో వస్తువులను తయారు చేస్తున్నాం. ఇంటిరియర్ వర్క్‌లో ఫ్లవర్ వాజెస్, వాల్ ప్యానెల్స్, డోర్ ప్యానెల్స్ చేస్తున్నాం.అలాగే దేవాలయం, దేవుళ్ల ఫొటోలతో కూడా ఎంబోజింగ్ వర్క్‌తో అది కూడా చేతి ద్వారా చేయడంతో ఆయా బొమ్మల ఆకారం స్పష్టంగా కనబడుతుంద’ని రంగశాయిపేట ఇత్తడి హస్తకళ బృంద సభ్యుడు ప్రణయ్ గురువారం ‘సాక్షి’కి వివరించారు. అలాగే వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. రంగశాయిపేట ఇత్తడి హస్తకళలకు రాష్ట్రపతి నిలయంలో జరిగిన అమృత్ మహోత్సవ్ ఎగ్జిబిషన్ లో చోటు దక్కడం జిల్లాకు దక్కిన గుర్తింపు. మరోసారి చేతికళలకు నిలయమని దేశమంతటా తెలిసింది. ఈ హస్త కళాకారులు భవిష్యత్‌లో ఇత్తడితో విభిన్న డిజైన్లు చేసి ఆర్థికాభివృద్ధి చెందడంతో పాటు జిల్లాకు మంచి గుర్తింపు వచ్చేలా పనిచేయాలని ఆకాంక్షించారు.
● రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక గుర్తింపు
● వరంగల్‌కు దక్కిన గౌరవంపై ప్రశంసలు
● ప్రత్యేక ఆకృతులతో ఆకట్టుకుంటున్న స్టాల్
Comments
Please login to add a commentAdd a comment