కుమారుడిని ఎస్సై అకారణంగా తిట్టాడని..
రాయపర్తి: న్యాయం చేయాలని స్టేషన్‌కు వస్తే ఎస్సై.. తమ కుమారుడిని అకారణంగా తిట్టాడంటూ ఓ తండ్రి వ్యవసాయపొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఎస్సై శ్రవణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలంటూ ఆ రైతు కుటుంబ సభ్యులు వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఎర్రకుంటతండా గ్రామానికి చెందిన భూక్య మల్లునాయక్ తనకున్న మూడున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. తన పక్కనే ఉన్న మరో రైతు సపావత్ ద్వాల్యానాయక్ గతంలో తన భూమిలో బోరు వేయించుకున్నప్పుడు భవిష్యత్‌లో మల్లు బోరు వేసుకున్నా అభ్యంతరం చెప్పనని ఒప్పంద పత్రం రాసి ఇచ్చాడు. యాసంగి వరిసాగు చేస్తున్న క్రమంలో భూక్యా మల్లునాయక్‌కు చెందిన వరిపంట ఎండిపోతుండడంతో బోరు వేయించేందుకు బోరుబండిని తీసుకు వచ్చాడు. వేరేచోట వేయించుకోవాలంటూ ద్వాల్యా నాయక్ కుటుంబం బోరుబండిని పంపించారు. దీంతో ఆగ్రహానికి గురైన భూక్య మల్లునాయక్, కుటుంబ సభ్యులతో కలిసి ద్వాల్యా నాయక్‌కు చెందిన బోరు స్టార్టర్‌ను తీసుకు వచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మల్లునాయక్‌తో వచ్చిన తన కుమారుడిని ఎస్సై ‘ఏం చదువుకున్నవు’ అంటూ ఇష్టమొచ్చిన బూతులు తిడుతూ ‘నువ్వు చస్తే చావు నాకేం సంబంధం’ అనడంతో ఆవేశానికి లోనైన మల్లునాయక్ తన వ్యవసాయ పొలానికి చేరుకొని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మల్లు నాయక్ కుటుంబ సభ్యులు రాయపర్తిలోని పోలీస్ స్టేషన్ ఎదుట వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఎస్సై శ్రవణ్‌కుమార్ తనను అకారణంగా బూతులు తిట్టాడని తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, ఎస్సైని సస్పెండ్ చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట, జఫర్‌గడ్ ఎస్సైలు చందర్, రామ్‌చరణ్‌లు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికి వినలేదు. ఎస్సైని సస్పెండ్ చేస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని పట్టుబట్టారు. చీకటిపడే వరకు వారంతా అక్కడే ఉన్నారు. ఎస్సైని సస్పెండ్ చేయాలని నేడు (శుక్రవారం) కూడా ఆందోళన చేస్తామని అక్కడినుంచి వెళ్లిపోయారు.
పొలంవద్ద పురుగుల మందుతాగిన తండ్రి
వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై
కుటుంబ సభ్యుల ధర్నా
ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment