హన్మకొండ : మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ దిశగా వివిధ కార్యక్రమాల్లో మహిళలను భాగస్వాములను చేస్తోంది. ఈ క్రమంలో మహిళలతో సౌర విద్యుత్ ఉత్పత్తి చేయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాల్లో ప్రభుత్వ భూములు గుర్తించింది. ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 గ్రామాలను ఎంపిక చేసింది. ప్రభుత్వ స్థల లభ్యతను బట్టి హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు గ్రామాల చొప్పున మహబూబాబాద్ జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసింది. మహబూబాబాద్ జిల్లాలో ఒకే ప్రాంతంలో 8 ఎకరాల స్థలం అందుబాటులో ఉండడంతో ఒకే గ్రామాన్ని ఎంపిక చేసింది. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి నాలుగు ఎకరాల స్థలం అవసరం. ప్రతీ గ్రామంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఎంపిక చేసిన రెండు గ్రామైఖ్య సంఘాలకు 0.5 మెగావాట్ల చొప్పున సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. రెండు గ్రామైఖ్య సంఘాలకు ఒక మెగావాట్ చొప్పున ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది.
సౌర విద్యుత్ ఉత్పత్తి పెంపునకు
ప్రత్యేక చర్యలు..
సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చింది. ప్రధానంగా రైతులను సౌర విద్యుత్ ఉత్పత్తి వైపు ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభియాన్ ( పీఎం కుసుం) పథకం తీసుకొచ్చింది. రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. రైతులతో పాటు మహిళా స్వయం, రైతు ఉత్పత్తి, సహకార, నీటి వినియోగదారుల సంఘాలు, పంచాయతీలు సోలార్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా పథకం రూపొందించాయి. ప్రభుత్వ, దేవాలయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. వీరు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను స్థానిక డిస్కంలు ముందుగా నిర్ణయించిన టారిఫ్ ధరలకు కొనుగోలు చేస్తాయి.
యుద్ధప్రాతిపదికన
ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ..
రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం విధించుకోగా ఇందులో వెయ్యి మెగావాట్లు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ యుద్ధప్రాతిపదికన చేపట్టి సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయా లేదో అని అధికారులు పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 95 స్థలాల్లో 964 ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించారు. ఇందులో 53 స్థలాలు సోలార్ ప్లాంట్ ఏర్పాటునకు అనువుగా ఉన్నట్లు తేల్చారు. హనుమకొండ జిల్లాలో 38 స్థలాల్లో 15 స్థలాలు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. వరంగల్ జిల్లాలో 13 స్థలాల్లో 6, ములుగు జిల్లాలో 12 స్థలాల్లో 11, మహబూబాబాద్ జిల్లాలో 4 స్థలాల్లో 4, జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 13 స్థలాల్లో 8, జనగామ జిల్లాలో 15 స్థలాల్లో 9 స్థలాలు అనువుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఒక్క మెగావాట్ ప్లాంట్‌కు
రూ.3 కోట్ల వ్యయం..
ఒక్క మెగావాట్ ప్లాంట్‌కు రూ.3 కోట్ల వ్యయం కానుంది. ఇందులో స్వయం సహాయక సంఘాలు 10 శాతం కింద రూ.30 లక్షలు భరిస్తే, బ్యాంకు 90 శాతం రుణం కింద రూ.2.70 కోట్లు అందిస్తుంది. ప్లాంట్ ద్వారా ఏడాదికి 1.66 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రోజుకు దాదాపు 4,500 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. యూనిట్‌కు డిస్కంలు రూ.3.13 చొప్పున చెల్లిస్తాయి. నెలకు ఉత్పత్తి అయిన విద్యుత్‌ను బట్టి ప్రతీ నెల డిస్కం చెల్లింపులు చేస్తుంది. సోలార్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 25 సంవత్సరాల పాటు ఆదాయం పొందొచ్చు.
నేడు ముఖ్యమంత్రితో ప్రారంభం..
ప్రభుత్వం మహిళా సంఘాలతో ముందుగా జిల్లాకు రెండు గ్రామాల్లో 2 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామాలను ఎంపిక చేశా రు. జనగామ జిల్లాలో అశ్వరావుపల్లి, వావిలాల, హనుమకొండ జిల్లాలో సూరారం, ఆత్మకూరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భజనపల్లి, మహాముత్తారం, ములుగు జిల్లాలో పత్తిపల్లి, జగ్గన్నపేట, వరంగల్ జిల్లాలో వంచనగిరి, మురిపిరాల, మహబూబాబాద్ జిల్లాలో అబ్బాయిపాలెం గ్రామాలను ఎంపిక చేశారు. శనివారం జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మహిళలతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రయోగాత్మకంగా హనుమకొండ జిల్లాకు 2 మెగావాట్ల ఉత్పత్తి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
12 మెగావాట్ల ఉత్పత్తి
ఆరు జిల్లాల్లో 11 గ్రామాల ఎంపిక
ప్రభుత్వ భూముల్లో
సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు
నేడు (మహిళా దినోత్సవం రోజు) సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment