పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

పరిష్కారం

Published Sun, Mar 9 2025 1:34 AM | Last Updated on Sun, Mar 9 2025 1:32 AM

పరిష్

పరిష్కారం

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌

ఆమోదరీతిలో

వివాదాలు

హన్మకొండ అర్బన్‌ : ‘ప్రస్తుతం ప్రారంభిస్తున్న ‘సామాజిక మధ్యవర్తిత్వ’ కేంద్రంలో ఉండే కులపెద్దలు న్యాయపరమైన శిక్షణ పొందిన వారై ఉంటారు.. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలకు పరస్పర ఆమోద రీతిలో వివాదాలు పరిష్కరించే అవకాశం ఉంటుంది’ అని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ అన్నారు. శనివారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల ఆధ్వర్యంలో జాతీయ లోక్‌అదాలత్‌, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ మాట్లాడుతూ నేడు ప్రారంభించిన సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో అమలు చేయడం ద్వారా ప్రజలకు సత్వర న్యాయం లభిస్తుందన్నారు. మధ్యప్రదేశ్‌లో సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఆ ఫలితాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వలంటీర్లు, పెద్దలుగా ఉండేందుకు ఆసక్తి గల వారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందులో సేవలు అందించేవారు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేయాలన్నారు. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు.

సామాజిక మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గం..

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ సామాజిక మధ్యవర్తిత్వ కేంద్రాలు ఉత్తమ సేవలు అందిస్తే రానున్న రోజుల్లో పెండింగ్‌ కేసుల పరిష్కారంతోపాటు కొత్త కేసులు నమోదు లేని వ్యవస్థను చూస్తామన్నారు. దేశంలో కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. మధ్యప్రదేశ్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో మొదట నిజామాబాద్‌, కామారెడ్డిలో ప్రారంభించామన్నారు. అక్కడ సత్ఫలితాలు వస్తుండడంతో ప్రతి జిల్లాకు విస్తరించేలా ఈ కార్యక్రమం చేపట్టడం శుభపరిణామమన్నారు. సామాజిక మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్‌ కేసులు వేగంగా పరిష్కారం కావడంతోపాటు కొత్త కేసులు నమోదు కూడా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వరంగల్‌, హనుమకొండ జిల్లాల న్యాయవ్యహారాల న్యాయమూర్తి జస్టిస్‌ మౌసుమీభట్టాచార్య వర్చువల్‌గా మాట్లాడుతూ సామాజిక మధ్యవర్తిత్వం ద్వారా రానున్న రోజుల్లో పెండింగ్‌ కేసులు పూర్తిగా తగ్గిపోతాయన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్‌. పంచాక్షరి మాట్లాడుతూ వలంటీర్లకు ముందు శిక్షణ ఇవ్వడం వల్ల వారు చట్టంపై అవగాహన ఉండి ఆ మేరకు సమస్య పరిష్కారాని కృషి చేస్తారన్నారు. కేసుల పరిష్కారం విషయంలో ఇరు పక్షాల వివరాలు గోప్యంగా ఉంచాలన్నారు. కేసు వివరాల నమోదులో ఎక్కడా ఎవరి వల్ల కేసు పరిష్కారమైంది.. ఎవరి వల్ల పరిష్కారం కాకుండా ఆగిందనే అంశం నమోదు చేయొద్దని సూచించారు. తుది ఫలితం మాత్రమే నమోదు చేయాలన్నారు. సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమ సభ్యులు బూర విద్యాసాగర్‌, శంతన్‌రామరాజు, యాదగిరి గౌడ్‌, భిక్షపతి యాదవ్‌ సందేహాలను న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ నివృతి చేశారు. వివిధ జిల్లాల కలెక్టర్లు మాట్లాడుతూ సామాజిక మధ్యవర్తిత్వ కేంద్రాల మనుగడకోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. వివిధ జిల్లాల పోలీస్‌ ఉన్నతాధికారులు, ఎస్పీలు మాట్లాడుతూ సామాజిక మధ్యవర్తిత్వ కేంద్రాలతో పోలీస్‌ స్టేషన్లకు వచ్చే సివిల్‌ కేసులు చాలా వరకు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా ఇతర కేసులపై పోలీసులు దృష్టిసారించొచ్చన్నారు. కార్యక్రమంలో వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌. రమేశ్‌బాబు, సభ్య కార్యదర్శులు సీహెచ్‌. పంచాక్షరి, హనుమకొండ, వరంగల్‌, ములుగు, జనగామ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, డాక్టర్‌ దివాకర, రిజ్వాన్‌బాషా, అద్వైత్‌కుమార్‌, రాహుల్‌శర్మ, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌కిశోర్‌ ఝా, కమిషనర్‌ అశ్వినితానాజీ వాఖడే, ఇతర అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనస్పర్థల కారణంగా విడిపోయిన జంటకు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఒకటి చేశారు. అదే విధంగా రోడ్డు ప్రమాద కేసును పరిష్కరించి బాధితురాలికి రూ.18 లక్షలు చెక్కు అందజేశారు.

పెండింగ్‌ కేసులు లేని వ్యవస్థను

చూడగలం

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌

న్యాయసేవాధికార సంస్థల ఆధ్వర్యంలో జాతీయ లోక్‌అదాలత్‌, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment
పరిష్కారం1
1/5

పరిష్కారం

పరిష్కారం2
2/5

పరిష్కారం

పరిష్కారం3
3/5

పరిష్కారం

పరిష్కారం4
4/5

పరిష్కారం

పరిష్కారం5
5/5

పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement