ప్రాణం తీసిన చేపలవేట
నెల్లికుదురు: నీటి కుంట మృత్యు కుహరంగా మారింది. చేపల వేటకు వెళ్లిన ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఒకే తండాకు చెందిన ఇద్దరు మృతి చెందడంతో విషాదం నెలకొంది. కుటుంబ పెద్దను కోల్పోయి ఒక కుటుంబం.. చేతికి అందివచ్చిన కుమారుడు విగత జీవిగా మారడంతో మరో కుటుంబం దుఃఖ సంద్రంలో మునిగిపోయింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పెద్దతండాకు చెందిన బాదావత్ శేఖర్ (21) హనుమకొండలోని ఓప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. సెమిస్టర్ పరీక్షలు ముగిశాయని ఇంటికొచ్చాడు. తండాలో పక్కపక్కనే ఇళ్లు ఉండడంతో భూక్య రాములు(45)తో కలిసి మేచరాజుపల్లి శివారులోని కుమ్మరికుంటలో చేపలు పట్టేందుకు శుక్రవారం మధ్యాహ్నం వెళ్లారు. రాత్రయినా ఇంటికి రాలేదు. దీంతో ఇరు కుటుంబాలు కలిసి వెతకగా.. కుమ్మరి కుంట వద్ద వారి చెప్పులు, బట్టలు కనిపించాయి. తండావాసులకు సమాచారం ఇచ్చి వెతకగా.. నీటి కుంటలో విగతజీవులై కనిపించారు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కుంటలో పడినట్లు, ఈత రానందున చనిపోయినట్లు తండావాసులు చెబుతున్నారు. శేఖర్, రాములు మృతితో తండాలో విషాదం అలుముకుంది. తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, కూలీ పనులకు వెళ్తూ రాములు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటికి పెద్ద చనిపోవడంతో రాములు కుటుంబం రోడ్డున పడింది. ఆసరాగా నిలుస్తాడనుకున్న శేఖర్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి
ఓ రైతు, యువకుడి మృతి
ఇటీవల అదుపు తప్పి కారుబోల్తా.. ఆరుగురికి గాయాలు
ప్రమాద కుంట!
రోడ్డుకు ఆనుకుని కుమ్మరి కుంట ఉంది. ఇందులో 15 రోజుల క్రితం కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. కుంట ప్రమాదకరంగా మారిందని, తగు రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రాణం తీసిన చేపలవేట
ప్రాణం తీసిన చేపలవేట
Comments
Please login to add a commentAdd a comment