సాక్షి, మహబూబాబాద్: ప్రకృతి సహకరిస్తేనే రైతు పండించిన పంటలు చేతికొస్తాయి. కాగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా.. అతివృష్టితో జిల్లాలోని చెక్ డ్యామ్‌లు, చెరువులు, కుంటలు తెగిపోయాయి. దీంతో మండు వేసవిలో నిండు కుండల్లా ఉండాల్సిన వాగులు, ఏర్లు ఎడారిని తలపిస్తున్నాయి. దీని మూలంగా భూగర్భ జలాలు అడుగంటాయి. బోరు మోటార్లు ఆగిఆగి పోస్తున్నాయి. దీంతో యాసంగి పంటలకు సాగునీరు దినదినగండంగా మారుతోంది. వరుస తడులు పెట్టినా మడి పారక నెర్రెలు బారాయి. దీంతో రైతులు పంటలను పశువులను మేపుతున్నారు. అప్పులు ఎలా తీర్చాలని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
యాసంగి సాగు ఇలా..
ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది యాసంగిలో మొత్తం 2,09,898 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో వరి 1,37,485 ఎకరాలు, మొక్కజొన్న 45,714ఎకరాలు, పెసర 1,995, జొన్న 680 ఎకరాలతో పాటు బొబ్బెర్లు, శనిగ, పొద్దుతిరుగుడు మొదలైన పంటలు 24,022 ఎకరాల్లో సాగుచేశారు. ఇందులో ప్రధానంగా వరిపంట పొట్టదశకు రాగా మొక్కజొన్న గింజపోసే దశకు వచ్చింది. ఈ రెండు పంటలకు ఇప్పుడు సమృద్ధిగా నీరు కావాల్సి ఉండగా.. పలుచోట్ల నీరులేక ఎండిపోవడం, మరి కొన్నిచోట్ల వారానికోమారు నీటితడి పెట్టే పరిస్థితి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment