అప్రెంటిస్‌తో ఉద్యోగం ఈజీ.. | - | Sakshi
Sakshi News home page

అప్రెంటిస్‌తో ఉద్యోగం ఈజీ..

Published Mon, Mar 10 2025 10:31 AM | Last Updated on Mon, Mar 10 2025 10:26 AM

అప్రెంటిస్‌తో ఉద్యోగం ఈజీ..

అప్రెంటిస్‌తో ఉద్యోగం ఈజీ..

ఐటీఐ వంటి సాంకేతిక విద్యతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతున్నారు. ఐటీఐలోని ఆయా విభాగాలకు అనుగుణంగా విద్యార్థులు పూర్తి చేసే అప్రెంటిస్‌తో ఉద్యోగ అన్వేషణకు తమ మార్గాన్ని మరింత సులభం చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఏటా ఐటీఐ పూర్తి చేసిన వారంతా వివిధ కంపెనీల్లో అప్రెంటిస్‌ శిక్షణ పొందుతూ తమ కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

కాజీపేట: ఐటీఐ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిస్‌ చేస్తే ఏ కంపెనీలోనైనా ఉద్యోగం తేలిగ్గా సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 32 ట్రేడుల్లో శిక్షణ పూర్తి చేసుకున్నవారు అప్రెంటిస్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకోసం www.apprenticeship.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థి పేరును నమోదు చేసుకుంటే సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. అప్రెంటిస్‌ ఇచ్చే కంపెనీల పేర్ల జాబితా మెయిల్‌కు వస్తుంది. పదో తరగతి ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, ఐటీఐ ట్రేడ్‌ ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌ పత్రాలను స్కానింగ్‌ చే యాల్సి ఉంటుంది. అభ్యర్థి ట్రేడ్‌ను బట్టి అతడు ఏ కంపెనీకి అర్హుడో తేలికగా తెలిసిపోతుంది. కంపె నీలు కూడా అప్రెంటిస్‌ ఇచ్చేందుకు అదే వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకుంటాయి. కంపెనీ పేరు, జీఎస్టీ నంబర్‌, ఈపీఎఫ్‌ నంబర్‌, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్‌ వంటివి వెబ్‌సైట్‌లో పేర్కొనడం ద్వారా ఆయా కంపెనీలు అప్రెంటిస్‌ ఇచ్చేందుకు అర్హత పొందుతాయి. ఐటీఐ రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన వారికి ఏడాదిపాటు.. ఏడాది ట్రేడ్‌ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులైతే రెండేళ్ల అప్రెంటిస్‌ శిక్షణ ఉంటుంది.

3వేల మందికిపైగా పేర్ల నమోదు

ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో చదివి ఉత్తీర్ణులైన సుమారు 3వేల మందికిపైగా అభ్యర్థులు అప్రెంటిస్‌ కోసం పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో అర్హులకు వివిధ కంపెనీలు తమ అవసరాల మేరకు కాల్‌ లెటర్లు పంపుతున్నాయి. అప్రెంటిస్‌ అవ్వగానే చాలా కంపెనీలు ఉద్యోగావకాశాలు సైతం కల్పిస్తున్నాయి.

నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ప్రమోషన్‌ స్కీం

2016 నేవ్స్‌ (నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ప్రమోషన్‌ స్కీం) కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఇందులో కొంత మొత్తాన్ని అప్రెంటిస్‌ చేసే అభ్యర్థులకు రీయింబర్స్‌మెంట్‌ కింద కంపెనీలకు అందజేస్తాయి. అభ్యర్థికి నెలకు రూ.8,500 స్టయిఫండ్‌గా లభిస్తుంది. దేశంలో అప్రెంటిస్‌ శిక్షణ నిమిత్తం అన్ని రాష్ట్రాలకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.4వేల కోట్లు కేటాయించింది. 50 లక్షల మంది అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోనుంది. ఇదంతా 2026 నాటికి పూర్తవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఏయే కంపెనీలు..

ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, బెల్‌, బీడీఎల్‌, బీహెచ్‌ఈఎల్‌, ఈసీఐఎల్‌, ఆర్టీసీ, జెన్‌కో, సింగరేణితోపాటు అనేక సంస్థలు అప్రెంటిస్‌ శిక్షణ ఇచ్చే జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీలు జిల్లాలతో సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తున్నాయి. వీటితోపాటు పలు ప్రైవేట్‌ కంపెనీలు కూడా అప్రెంటిస్‌ శిక్షణ ఇస్తూ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. అయితే వరంగల్‌, కరీంనగర్‌ రీజియన్లలో ఉన్న ఆర్టీసీ డిపోలతోపాటు రైల్వే పలు జోన్లలో ఏడాదికి 25వేల మందికిపైగా అభ్యర్థులు అప్రెంటిస్‌ నిమిత్తం శిక్షణ పొందుతున్నారు.

నిరుద్యోగ యువతకు అదనపు అర్హత

అప్రెంటిస్‌తో పెరుగుతున్న

ఉపాధి అవకాశాలు

అవకాశాలు మెరుగుపడ్డాయి

ఉపాధికి ఐటీఐలు ఎంతగానో దోహదపడతాయి. గతంతో పోల్చితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలతో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. అప్రెంటిస్‌ అవకాశాలు దొరుకుతున్నాయి. ప్రతీ మూడు నెలలకోసారి ఐటీఐ కేంద్రాల్లో అప్రెంటిస్‌ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాం.

– వెంకటేశ్వర్‌ రావు, ప్రిన్సిపాల్‌,

కాజీపేట ఐటీఐ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement