రేపు కొండపర్తికి గవర్నర్ రాక
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలోని కొండపర్తికి రేపు(మంగళవారం) రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నట్లు అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండపర్తి గిరిజన గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రామంలో పలు రకాల అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు గవర్నర్ కొండపర్తి రానున్నట్లు వెల్లడించారు.
వరంగల్ మీదుగా
హోలీకి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : హోలీ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. ఈ నెల 10వ తేదీన నిజాముద్దీన్ నుంచి బయలుదేరే నిజాముద్దీన్–తిరువనంతపురం నార్త్ (06074) ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు వరంగల్‌కు చేరుతుంది. ఈ నెల 14వ తేదీన తిరువనంతపురం నార్త్ నుంచి బయలుదేరే తిరువనంతపురం నార్త్–నిజాముద్దీన్ (06073) ఎక్స్‌ప్రెస్ వరంగల్‌కు మరుసటి రోజు చేరుతుంది. ఈ నెల 17వ తేదీన నిజాముద్దీన్–తిరువనంతపురం నార్త్ (06074) ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు వరంగల్‌కు చేరుతుంది. ఈ రైళ్లకు కొల్లం, కాయంకులం, చెంగనూర్, తిరువల్ల, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, అలువ, త్రిసూర్, పాలఘడ్, పండనూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలర్‌పెట్టయ్, పట్‌పడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, విజయవాడ, వరంగల్, బల్హార్షా, నాగ్‌పూర్, రాణి కమలాపథ్, బినా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, మతుహుర స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు అధికారులు తెలిపారు.
సాగునీటి కోసం
రైతుల ఘర్షణ
● ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్‌కు
అడ్డుగా రాళ్లు
చిన్నగూడూరు: పంటల సాగుకు ఎస్సారెస్పీ జలాల కోసం మహబూబాబాద్ జిల్లా మరిపెడ, చిన్నగూడూరు మండలాల రైతులు శనివారం రాత్రి ఘర్షణ పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ నుంచి చిన్నగూడూరు మండలం విస్సంపల్లి పంట పొలాలకు నీరు రాకుండా మరిపెడ మండలం బాల్యతండా, లక్ష్మాతండా రైతులు రాళ్లు అడ్డుపెట్టారు. దీంతో విస్సంపల్లి రైతులు శనివారం రాత్రి కెనాల్ వద్దకు చేరుకుని తమ గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని రాళ్లు తీసే ప్రయత్నం చేయగా రెండు ప్రాంతాల రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. మెయిన్ కెనాల్‌ను తాము సుమారు రూ.30 వేలు వెచ్చించి బాగు చేయిస్తే నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని విస్సంపల్లి, తుమ్మల చెరువుతండాల రైతులు వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment