లక్ష మందితో రజతోత్సవ సభ
సాక్షిప్రతినిధి, వరంగల్ : పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బీఆర్‌ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా వరంగల్‌లో రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఓరుగల్లుకు.. బీఆర్‌ఎస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని, వరంగల్ వేదికగా గతంలో 15 లక్షల మందితో మహా గర్జన నిర్వహించిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీదని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల నిర్వహణ కోసం సోమవారం సాయంత్రం వరంగల్ నగర శివారులోని ఉనికిచర్ల, భట్టుపల్లి ప్రాంతాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో కలిసి హరీశ్‌రావు సభాస్థల పరిశీలన చేశారు. అనంతరం హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించే సభకు రెండుచోట్లా స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటాన్ని, పదేళ్ల పరిపాలనకు నిదర్శనంగా రజతోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సామాజిక, చారిత్రక అవసరాలకోసం ఉద్యమం
సామాజిక, చారిత్రక అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేపట్టి ప్రత్యేక తెలంగాణ సాధించినట్లు హరీశ్‌రావు అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రారంభించిన పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని, రైతుబంధు పథకం పీఎం కిసాన్‌గా, మిషన్ భగీరథ పథకాన్ని హర్ ఘర్ ఘర్‌కి జల్ అని అమలు చేస్తున్నారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఒక్క ఉచిత బస్సు తప్ప, ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదని అన్నారు. ప్రజలంతా కేసీఆర్ ను చూడాలని, తన మాట వినాలని కోరుకుంటున్నారని, అందుకే బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హరీశ్ స్పష్టం చేశారు. ప్రజలకు పనిచేసేది ఎవరో, చెయ్యని వారు ఎవరో, పాలు ఏందో, నీళ్లు ఏందో, గట్టోడు ఎవరో, వట్టోడు ఎవరో తెలిసిందని, వారు గమనిస్తూ ఉన్నారని అన్నారు.
మిలియన్ మార్చ్ రోజు
వరంగల్‌లో ఉండటం అదృష్టం..
‘మిలియన్ మార్చ్‌కు సోమవారంతో 14 ఏళ్లు పూర్తి.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటైన మిలియన్ మార్చ్ జరిగిన రోజున పోరాటాల ఖిల్లా వరంగల్‌లో ఉండటం.. మీతో గడపడం అదృష్టం’ అంటూ హరీశ్‌రావు నాటి సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, శంకర్ నాయక్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, కన్నూరు సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
ఉనికిచర్ల.. భట్టుపల్లిలో చూశాం.. మరోసారి స్థల పరిశీలన
ఓరుగల్లుతో బీఆర్‌ఎస్‌కు
విడదీయరాని బంధం..
పోరాటాలకు పురుడుపోసిన గడ్డమీదే ఏప్రిల్ 27న ఆవిర్భావ వేడుకలు
మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment