గ్రూప్–1లో మెరిసిన గిరిజన ఆణిముత్యం
గార్ల: గిరిజన రైతు కుటుంబంలో పుట్టి గ్రూప్–1లో 900 మార్కులకు 454 మార్కులు సాధించాడు గిరిజన ఆణిముత్యం గంగావత్ పవన్‌కల్యాణ్. మానుకోట జిల్లా గార్ల మండలం పెద్దకిష్టాపురం గ్రామానికి చెందిన గంగావత్ లక్ష్మణ్, మంగ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు గంగావత్ పవన్‌కల్యాణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో 1 నుంచి ఇంటర్ వరకు చదివాడు. 10వ తరగతిలో 10/10 జీపీఏ సాధించడమే కాకుండా ఇంటర్‌లో ఎంఈసీ గ్రూప్‌లో పబ్లిక్ స్కూల్లో టాపర్‌గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కళాశాలలో డిగ్రీలో సీటు సాధించి బీఏ ఎకనామిక్స్ పూర్తిచేశాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే గ్రూప్–1 పరీక్ష రాసిన పవన్‌కల్యాన్ ఉత్తమ ఫలితం సాధించాడు. ఎస్టీ విభాగంలో కాకుండా ఓపెన్ కోటాలోనే డిప్యూటీ కలెక్టర్ పోస్టు వస్తుందని పవన్‌కల్యాణ్ ధీమా వ్యక్తం చేశాడు. పవన్‌కల్యాణ్‌ను గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు.
జశ్వంత్‌రాజ్‌ప్రతిభ
మహబూబాబాద్ అర్బన్: సోమవారం విడుదలైన గ్రూప్ వన్ ఫలితాల్లో మానుకోట జిల్లా కేంద్రంలోని సంఘాల రవికుమార్ ప్రసన్న దంపతుల కుమారుడు సంఘాల జశ్వంత్‌రాజ్ 900 మార్కులకు 465 మార్కులు సాధించాడు. గ్రూప్ వన్‌లో అత్యధికంగా మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టెన్త్ స్పాట్ విధుల రెమ్యునరేషన్ చెల్లించండి
● డీఈఓకు టీఆర్‌టీఎఫ్ వినతి
విద్యారణ్యపురి: గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం హనుమకొండలో టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యంకణంలో విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు నేటికీ రెమ్యునరేషన్ చెల్లించలేదు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్‌టీఎఫ్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బాసిరి రాజిబాపురావు, జనరల్ సెక్రటరీ గుగులోతు శ్రీనివాస్‌నాయక్‌లు సోమవారం డీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రెమ్యునరేషన్‌తోపాటు టీఏ, డీఏలు చెల్లించలేదని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈఏడాది ఏప్రిల్‌లో కూడా టెన్త్ విద్యార్థుల పరీక్షల జవాబు పత్రాల మూల్యంకనం ఉంటుందని కానీ, గత ఏడాదికి సంబంధించిన రెమ్యునరేషనే ఇవ్వకపోవడం దారుణమన్నారు. వెంటనే రెమ్యునరేషన్ చెల్లించాలని లేదంటే ఈఏడాది నిర్వహించబోయే స్పాట్ వాల్యూయేషన్‌ను ఉపాధ్యాయులు బహిష్కరించాల్సి వస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
క్రీడల్లోనూ పిల్లలను
ప్రోత్సహించాలి
వరంగల్ స్పోర్ట్స్: పిల్లలను చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని సీనియర్ సివిల్ జడ్జి క్షేమదేశ్‌పాండే తల్లిదండ్రులకు సూచించారు. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ బస్టాండ్ సమీపంలోని శ్రీహర్ష కన్వెన్షన్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన ఓపెన్ టు ఆల్ ఉమ్మడి జిల్లా స్థాయి చదరంగ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి క్షేమదేశ్‌పాండే, విశిష్ట అతిథిగా కన్వెన్షన్‌హాల్ డైరెక్టర్ వేణు హాజరై విజేతలకు బహుమతులను అందజేసి, మా ట్లాడారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి 80 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఓపెన్ టు ఆల్ విజేతగా అల్లాడి శ్రీవాత్సవ్ నిలవగా వరుస స్థానాల్లో రిత్విక్ గండు, షేక్ రియాజ్, స్వాతి దేవరపల్లి, ఎం.దీక్షిత్ నిలిచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్లు, తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్–1లో మెరిసిన గిరిజన ఆణిముత్యం
గ్రూప్–1లో మెరిసిన గిరిజన ఆణిముత్యం
Comments
Please login to add a commentAdd a comment