బైక్‌ను ఢీకొన్న కారు..
నల్లబెల్లి: జాతీయ రహదారిపై ఓ కారు అతివేగం, అజాగ్రత్తగా వస్తూ వెనుక నుంచి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మంగళవారం నల్లబెల్లి మండలం బజ్జుతండా బస్ స్టేజీ వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. మండలంలోని నారక్కపేటకు చెందిన మాడుగుల రజిత, శ్రీను దంపతుల కుమారుడు అజయ్(22) డిగ్రీ వరకు చదువుకున్నాడు. నర్సంపేటలో ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణలో తల్లిదండ్రులకు ఆసరా అవుతున్నాడు. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు జన్ను అజయ్‌తో కలిసి తన ద్విచక్రవాహనంపై నారక్కపేట, లచ్చిరెడ్డి కుంట మీదుగా నల్లబెల్లికి వెళ్లే క్రమంలో బజ్జుతండా బస్ స్టేజీ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. ఈ క్రమంలో హనుమకొండ సుబేదారికి చెందిన కాసోజు శ్రీనివాస్ కారులో నర్సంపేట నుంచి నల్ల బెల్లి వైపునకు అతివేగంగా వస్తూ వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అజయ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. జన్ను అజయ్‌కి తీవ్రంగా, కారు డ్రైవర్ శ్రీనివాస్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై గోవర్ధన్ సిబ్బంది కలిసితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. అజయ్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. అజయ్ మృతితో నారక్కపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. కాగా, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్.. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.3 వేలు ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల బస్సును ఢీకొని
ఏటూరునాగారంలో మరొకరు..
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని సినిమా థియేటర్ ప్రదేశంలోని యూ టర్న్ వద్ద స్కూల్ బస్సును ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఏఎస్సై సుబ్బారావు కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం ఎస్‌వీవీ పాఠశాలకు చెందిన ఏపీ 36 టీఏ 7266 గల పాఠశాల బస్సు డ్రైవర్ యూటర్న్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన శెట్టి నరేశ్(38) బస్సు వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. బైక్ అదుపు తప్పి స్కూల్ బస్సును ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో 108లో ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్య అమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.
యువకుడి దుర్మరణం, మరొకరికి గాయాలు
బజ్జుతండా బస్ స్టేజీ వద్ద ఘటన
బైక్‌ను ఢీకొన్న కారు..
Comments
Please login to add a commentAdd a comment