అన్నను చంపిన తమ్ముడికి జీవిత ఖైదు
కాటారం: భూమి విషయంలో అన్నను చంపిన తమ్ముడికి జీవితఖైదు శిక్షతో పాటు రూ.పదివేల జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు మంగళవారం తీర్పు వెలువరించారు. ఎస్సై మ్యాక అభినవ్ కథనం ప్రకారం.. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన మృతుడు మారుపాక నాగరాజు, నిందితుడు మారుపాక అశోక్ అన్నదమ్ములు. స్వగ్రామంలో ఇంటి స్థలం ఉండగా నాగరాజు, అశోక్, వారి తల్లి శంకరమ్మ సమానంగా పంచుకున్నారు. నాగరాజు తనకు వాటాగా వచ్చిన స్థలంలో ఇళ్లు నిర్మించుకోగా అశోక్ మద్యానికి బానిసై తన వాటా భూమిని అమ్ముకున్నాడు. అన్న ఇంట్లో సైతం తనకు వాటా వస్తుందని పలుమార్లు నాగరాజు కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేయడంతో వారు గ్రామం వదిలి వేరే చోట నివసిస్తున్నారు. ఈ క్రమంలో 2019, మే 10న ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేయడానికి నాగరాజు గ్రామానికి రాగా అశోక్ అతడితో గొడవపడి బీరు సీసాతో గొంతులో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సరిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు అశోక్‌పై హత్య కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ శివప్రసాద్ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తర్వాత వచ్చిన సీఐ హథీరామ్ కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. మంగళవారం కేసు తుది విచారణ జరిగింది. కోర్ట్‌లైజన్ ఆఫీసర్, ఏఎస్సై గాండ్ల వెంకన్న ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుళ్లు రమేశ్, వినోద్.. సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో ప్రధాన న్యాయమూర్తి.. నిందితుడు అశోక్‌కు జీవితఖైదు జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్‌తో పాటు అప్పటి దర్యాప్తు అధికారులను ఎస్పీ కిరణ్‌ఖరే అభినందించారు.
తీర్పు వెలువరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు
Comments
Please login to add a commentAdd a comment