ఫీజుల కోసం ఫలితాల నిలిపివేత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అకడమిక్ డీన్‌కు ఇంకా 84 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఫీజులు చెల్లించలేదు. దీంతో యూనివర్సిటీ పరిధిలోని ఆయా కాలేజీల విద్యార్థుల ఫలితాలు వెల్లడించడం లేదు. ఫలితంగా ఆయా విద్యార్థులు తాము ఉత్తీర్ణ సాధించామా?లేదా? ఏమైనా సబ్జెక్టుల్లో తప్పామనే అంశం తెలియక లబోదిబోమంటున్నారు. 53,728 మంది ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ బీఎస్సీ, బీసీఏ బి ఓకేషనల్ కోర్సులకు సంబంఽధించి మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు ఈనెల 4న విడుదల చేసిన విషయం విధితమే. అయితే యూనివర్సిటీలోని డీన్ అకడమిక్‌కు ఫీజులు చెల్లించకపోవడతో తొలుత 121 కళాశాలల ఫలితాలు నిలిపివేశారు. వారంలో కొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఫీజులు చెల్లించాయి. దీంతో వాటి ఫలితాలు విడుదల చేశారు. కేయూ పరిధిలో 304 (ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ గురుకుల కళాశాలలు ఉండగా) అందులో మంగళవారం వరకు 84 ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు వివిధ రకాల ఫీజులు చెల్లించలేదు. దీంతో ఆయా కళాశాల విద్యార్థుల ఫలితాల నిలిపివేత కొనసాగుతోంది.
రీవాల్యుయేషన్ గడువు కూడా..
డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు ఇచ్చాక 10 నుంచి 15 రోజులపాటు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పటికే ఫలితాలు విడుదల చేసిన కాలేజీల విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఫలితాలు విడుదల కాని విద్యార్థులు రీవాల్యుయేషన్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వారంలో ఈ గడువు కూడా ముగియబోతుంది. దీంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొని ఉంది.
డిగ్రీ 2,4,6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు
చెల్లింపునకు షెడ్యూల్..
డిగ్రీ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇటీవలే పరీక్షల విభాగం అధికారులు షెడ్యూల్ ఇచ్చారు. ఆయా సెమిస్టర్ల పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫీజులు కూడా ప్రైవేట్ యాజమాన్యాల విద్యార్థులు చెల్లించాల్సింటుంది. అయితే 1,3,5 ఫలితాల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు కూడా ఆయా సెమిస్టర్ల పరీక్షల ఫీజులు చెల్లించాల్సింటుంది.
ఇంకా చెల్లించని 84 కళాశాలలు
53,728మంది విద్యార్థుల నిరీక్షణ
ముగుస్తున్న రీవాల్యుయేషన్ గడువు
మరోవైపు డిగ్రీ 2,4,6 సెమిస్టర్ల ఫీజు కూడా..
Comments
Please login to add a commentAdd a comment