
అప్రమత్తత తప్పనిసరి
శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
● వస్తు సేవల్లో మోసాలపై జాగ్రత్త అవసరం
● కొనుగోలు చేసే సమయంలో
పరిశీలన ముఖ్యం
నేడు ప్రపంచ
వినియోగదారుల హక్కుల దినోత్సవం
తొర్రూరు: నాణ్యమైన వస్తువులు, సేవలనూ పొందడం వినియోగదారుల హక్కు. కానీ ప్రస్తుత కాలంలో మోసాలు ఎక్కువైపోయాయి. చివరికి మనం తాగే పాలు, నీళ్లలో కూడా నాణ్యత లేకుండాపోతోంది. తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే, నిలదీస్తే తప్ప న్యాయం జరగడం లేదు. ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారులే మేల్కొనాల్సిన అవసరం ఉంది. తమ హక్కులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాగా వినియోగదారులు మోసపోకుండా అండగా వినియోగదారుల రక్షణ చట్టం ఉంది. 1986 నుంచి ఇది అమలులో ఉండగా 2019లో మెరుగులుదిద్దారు. మార్పులతో ఏర్పడిన ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
చట్టం గురించి..
● 34 ఏళ్ల నుంచి ఉన్న చట్టంలో మార్పులు చేర్పులు చేసి కొత్తగా ఏర్పాటైన రక్షణ చట్టం–2019 జూలై 20, 2020 నుంచి అమల్లోకి వచ్చింది.
● వినియోగదారుల ఫిర్యాదులు వేగంగా పరిష్కరించుకోవడానికి ఇది దోహదం చేస్తుంది.
● నూతన చట్టం ప్రకారం సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) స్థాపించారు. దీని ద్వారా వినియోగదారుల హక్కులను ప్రోత్సహిస్తూ పరిరక్షిస్తున్నారు.
● వినియోగదారుల ఫోరంను వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌గా మార్చారు.
ఎక్కడ ఫిర్యాదు చేయాలంటే..
● వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కటే ఉంది.
● నేరుగా ఫోన్‌లో ఫిర్యాదు చేసే వీలు ప్రస్తుతం లేదు.
● హనుమకొండ సుబేదారిలో కమిషన్ కార్యాలయం ఉంది.
● కమిషన్ కార్యాలయంలో వినియోగదారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. సంబంధిత రశీదు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుంది.
● దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న
టోల్‌ఫ్రీ నంబర్ 180042500333 కు ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
కొనుగోలు విషయంలో సూచనలు..
కొనుగోలు చేస్తున్న వస్తువులు, సేవలపై గరిష్ట పరిమాణం, ఏ గ్రేడ్‌కు చెందినవి, వాటిలో కలిపిన పదార్థాలు, రంగులు, రసాయనాలు, ఎలా ఉపయోగించారో తెలిపే ప్రకటనను వినియోగదారులు కచ్చితంగా గమనించాలి. మందులు, ఆహార పదార్థాల చట్టం ప్రకారం అన్ని ఆహార పదార్థాల ప్యాకేజీలపై విధిగా నికర మొత్తం లేబుల్స్‌పై చూపాలి. వస్తువు ధర, తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారు చిరునామా, వస్తువు బరువు ముద్రించి ఉండాలి. ఉత్పత్తులపై ముద్రించిన ఎంఆర్‌పీపై స్టిక్కర్ అంటించి దాని ధరను మార్చి అమ్మడం జరుగుతుంది. ఈ విషయంలో కచ్చితంగా గమనించాలి.
అవగాహన అవసరం
కొనుగోళ్ల సందర్భంలో వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలి. ఏ వస్తువు, సరుకులు కొనుగోలు చేసినా విధిగా రశీదు తీసుకోవాలి. అన్యాయం జరిగితే నష్టం పరిహారం, న్యాయం పొందడానికి ఈ రశీదు ఉపయోగపడుతుంది. బాధితులు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే వినియోగదారుల సమాచారం కేంద్రం ద్వారా న్యాయం లభిస్తుంది.
–వింజమూరి సుధాకర్, వినియోగదారుల
సమాచార కేంద్రం జిల్లా కన్వీనర్
ప్రశ్నించారు.. గెలిచారు
జిల్లాలోని చిన్నగూడూరుకు చెందిన రైతు రావుల రాంరెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఓ కంపెనీకి చెందిన ఆడమగ వరి విత్తనాలు వేశాడు. అవి నాసిరకం కావడంతో పంట పూర్తిగా పోయింది. కంపెనీ ప్రతినిధులు స్పందించకపోవడంతో వినియోగదారుల సమాచార కేంద్రాన్ని ఆశ్రయించాడు. బాధిత రైతుకు ఆ కంపెనీ రూ.5.60 లక్షల నష్ట పరిహారం చెల్లించింది.
నర్సింహులపేటకు చెందిన రైతు నరసింహారెడ్డి, దాట్ల గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి కూడా ఇలాంటి కంపెనీల నుంచి రూ.7 లక్షల నష్టపరిహారం పొందారు.
తొర్రూరు పట్టణానికి చెందిన పందెబోయిన సురేశ్ ప్రైవేటు చిట్‌ఫండ్ కంపెనీలో చిట్ వేశాడు. కాలపరిమితి పూర్తయినా డబ్బులు చెల్లించకపోవడంతో ఆయన వినియోగదారుల సమాచార కేంద్రాన్ని ఆశ్రయించాడు. సదరు సంస్థకు నోటీసులు అందించి చిట్టి డబ్బులు రూ.5లక్షలు ఇప్పించి బాధితులకు న్యాయం చేశారు.
ఫిర్యాదు ఎలా చేయాలంటే...
ఫిర్యాదు చేసే విధానం చాలా సులభం. అలాగే దానిపై స్పందన కూడా త్వరగా ఉంటుంది. తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. న్యాయవాది అవసరం లేదు. ఫిర్యాదుదారుడైనా, అతడి ఏజెంటైనా ఫోరంలో స్వయంగా ఫిర్యాదు చేయవచ్చు. అలా వీలు కాకపోతే పోస్టు ద్వారా కూడా పంపే వీలుంది.
పరిహారాన్ని బట్టి ఫోరం..
రూ.20 లక్షల వరకు జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయాలి.
రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు రాష్ట్ర కమిషన్‌లో...
రూ.కోటి మించిన పక్షంలో జాతీయ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలి.
కొనుగోలు చేసినా లేదా నష్టం జరిగిన నాటి నుంచి రెండేళ్ల లోపు ఫిర్యాదు చేయవచ్చు. ఆలస్యానికి తగిన కారణం తెలిపితే ఆపై సంవత్సరం కూడా ఫిర్యాదు చేయవచ్చు.

అప్రమత్తత తప్పనిసరి

అప్రమత్తత తప్పనిసరి

అప్రమత్తత తప్పనిసరి

అప్రమత్తత తప్పనిసరి

అప్రమత్తత తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment