
పదవీ విరమణ డబ్బుల పంపకాల్లో కుమారులతో ఘర్షణ
● మనస్తాపానికి గురై రిటైర్డ్ ఉద్యోగి బలవన్మరణం
మహబూబాబాద్ రూరల్ : ఓ ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ అనంతరం వచ్చిన డబ్బుల పంపకాల విషయంలో కుమారులతో జరిగిన ఘర్షణతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని రామచంద్రపురం కాలనీలో నివాసం ఉండే ఏర్పుల వీరయ్య (63) పంచాయతీరాజ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా ఐదేళ్లక్రితం ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఉద్యోగ విరమణ డబ్బులురాగా ఇటీవల కుమారులకు, ఆయనకు మధ్య పంపకాల విషయంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. వీరయ్య ఈ విషయాలను ఎవరికీ చెప్పుకోలేక తనకు తానుగా బాధపడుతూ వారం రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని వెంకటరమణ లాడ్జిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం లాడ్జి నిర్వాహకులు వీరయ్య మృతిచెందిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపారు. టౌన్ ఎస్సై కే.శివ, హెడ్ కానిస్టేబుల్ దామోదర్ సంఘటన స్థలానికి చేరుకుని వీరయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment