పనులు చేపట్టేదెప్పుడో..?
డోర్నకల్: డోర్నకల్‌లో బైపాస్ రోడ్డు పనులకు భూసేకరణ అడ్డంకిగా మారింది. గార్ల నుంచి డోర్నకల్ మీదుగా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. గార్ల గేటు, రైల్వే ఆస్పత్రి, గాంధీసెంటర్, గండి సత్యనారాయణ మిల్లు, యాదవనగర్ మూలమలుపులు ఇరుకుగా, బ్యాంక్ స్ట్రీట్ నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురుకావడంతో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
2023లో..
రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో రూ.6 కోట్ల నిధులతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి 2023 అక్టోబర్ 2న అప్పటి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ శంకుస్థాపన చేశారు. 90వ లెవల్ క్రాసింగ్ గార్ల గేటు నుంచి గొల్లచర్ల–డోర్నకల్ ఆర్ అండ్ బీ రోడ్డులోని సమ్మర్ స్టోరేజ్ సమీపాన ప్రస్తుతం ఉన్న బైపాస్ రోడ్డును అనుసంధానిస్తూ కొత్త బైపాస్ రోడ్డు వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే నాటి నుంచి నేటి వరకు పనులు ప్రారంభం కాలేదు.
భూసేకరణే అడ్డంకి...
గార్ల గేటు వద్ద చేపట్టిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి సమ్మర్ స్టోరేజ్ సమీపంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు 1.7కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం కొంతమేర రోడ్డు ఉండగా.. మిగిలిన రోడ్డు కోసం 8ఎకరాల భూ సేకరణ చేపట్టాలని రెవెన్యూశాఖ అధికారులు గుర్తించారు. 28 మంది రైతుల నుంచి 8ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇందులో 6 ఎకరాలు డోర్నకల్ పట్టణ పరిధిలో.. 2ఎకరాలు గార్ల మండలం బుద్ధ్దారం గ్రామ పరిధిలో ఉంది. రెవెన్యూ సిబ్బంది సర్వే నిర్వహించి సేకరించాల్సిన భూమిని గుర్తించి రైతులకు సమాచారం అందించగా ఒకరిద్దరు రైతులు భూమి ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో రోడ్డు పనులు ప్రారంభం కాలేదు.
భూమి అప్పగిస్తే..
రెవెన్యూ సిబ్బంది తమకు భూమి అప్పగిస్తే రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. కాగా భూసేకరణ పూర్తి చేసి బైపాస్ రోడ్డు పనులు ప్రారంభించాలని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ గతంలో మహబూబాబాద్ ఆర్డీఓకు లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న బైపాస్ రోడ్డు భారీ వాహనాల రాకపోకలతో పూర్తిగా ధ్వంసం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా నూతన బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే డోర్నకల్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అధికారులు వెంటనే స్పందించి భూసేకరణ పూర్తి చేసి బైపాస్ రోడ్డు పనులు పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
బైపాస్ రోడ్డు పనులకు
అడ్డంకిగా మారిన భూసేకరణ
ముగింపునకు రైల్వే ఫ్లైఓవర్‌బ్రిడ్జి పనులు
Comments
Please login to add a commentAdd a comment