పోలీసులకు చిక్కిన కొత్త హరిబాబు?
భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి పట్టణానికి చెందిన రాజలింగమూర్తి గత నెల(ఫిబ్రవరి) 19న రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు పాల్పడిన, సహకరించిన ఏడుగురిని ఫిబ్రవరి 23న ఎస్పీ కిరణ్ ఖరే అరెస్ట్ చూపించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఏ–9గా ఉన్న పుల్ల నరేశ్‌ను ఈ నెల1వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ–8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు కొత్త హరిబాబు, ఏ–10గా ఉన్న పుల్ల సురేశ్ కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. కాగా, కొత్త హరిబాబు ఈ నెల 4వ తేదీన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ పిటిషన్‌పై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. నేడు(సోమవారం) సైతం హైకోర్టులో వాదనలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే హరిబాబును ప్రత్యేక టీం పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
క్రెడిట్ కార్డు ఆధారంగా పట్టివేత..
రాజలింగమూర్తి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా చర్చానీయాంశం అయ్యింది. దీంతో హత్య కేసులో ఏ–8 నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబును పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే మొబైల్‌ఫోన్‌ను వినియోగించకపోవడంతో అతడు ఎక్కడ ఉన్నాడనేది పోలీసులు గుర్తించలేకపోయారు. ఢిల్లీలో ఉన్నట్లు అనుమానించిన పోలీసులు కొద్ది రోజులుగా అక్కడ మకాం వేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే అతడు క్రెడిట్ కార్డును పలుచోట్ల వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. సమీప ప్రాంతాలపై నిఘా వేసి శనివారం రాత్రి హరిబాబును పట్టుకొని కారులో బయలుదేరి ఆదివారం రాత్రి భూపాలపల్లికి చేరుకున్నట్లు తెలిసింది. అర్ధరాత్రే అరెస్ట్ చూపించి, జడ్జి ఎదుట హాజరుపరిచి, జడ్జి ఆదేశాల మేరకు జైలుకు పంపించనున్నట్లు సమాచారం.
ఇద్దరు మిలీషియా సభ్యుల లొంగుబాటు
ఏటూరునాగారం: నిషేధిత సీపీఐ మావో యిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మిలీషియా సభ్యులు లొంగిపోయినట్లు ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. ఆదివారం స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు వెల్ల డించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు పార్టీ సీఎన్‌ఎం సభ్యుడు మడవి కోస, మరో సభ్యురాలు మడకం సోడి అలియాస్ జోగి పార్టీ సిద్ధాంతాలు నచ్చక లొంగిపోయినట్లు పేర్కొన్నారు. వీరు పోలీసుల సమాచారాన్ని పార్టీ నాయకత్వానికి చేరవేయడంతోపాటు పలు విధ్వంసాలకు పాల్పడినట్లు చెప్పారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. స్వేచ్ఛగా జీవించేలా పోలీసులు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారని వివరించారు. కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, వెంకటాపురం సీఐ బండారి కుమార్, వెంకటాపురం ఎస్సై తిరుపతిరావు, సెకండ్ ఎస్సై నర్సింహ పాల్గొన్నారు.
● రాజలింగమూర్తి హత్య కేసులో ఏ–8గా కేసు నమోదు
● క్రెడిట్ కార్డు వినియోగం ఆధారంగా పట్టుకున్న ప్రత్యేక టీం
● ఢిల్లీ నుంచి కారులో భూపాలపల్లికి తీసుకొచ్చిన పోలీసులు?
పోలీసులకు చిక్కిన కొత్త హరిబాబు?
Comments
Please login to add a commentAdd a comment