హూన్యాతండాలో మహిళ హత్య
డోర్నకల్: డోర్నకల్ మండలం హూన్యాతండాలో ఓ మహిళ హత్యకు గురైంది. ఆమె భర్త తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో చేరాడు. ఈ ఘటన ఆదివారం తండాలో కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్యా బుజ్జి(51), రామా దంపతులు. వీరికి కుమారుడు అశోక్, కూతురు సౌందర్య ఉన్నారు. అశోక్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, సౌందర్య హూన్యాతండా సమీపంలోని గార్ల మండలం పులిగడ్డ తండాలో భర్తతో నివాసం ఉంటుంది. శనివారం రాత్రి హోలీ వేడుకల్లో నృత్యం చేసిన బుజ్జి అనంతరం ఇంటికి వెళ్లింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి దంపతులు బయటకు రాలేదు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రామా ఇంటి నుంచి తీవ్ర గాయాలతో బయటకు వచ్చి సమీపంలో పడిపోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా బజ్జి రక్తపు మడుగులో చనిపోయి ఉంది. డోర్నకల్ సీఐ బి.రాజేశ్, ఎస్సై గడ్డం ఉమ ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న రామాను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బుజ్జి హత్య విషయం తెలుసుకున్న కూతురు సౌందర్యతోపాటు చుట్టు పక్కల తండాలకు చెందిన ప్రజలు ఘటనాస్థలికి చేరుకున్నారు. మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు తండాకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోలీసులను వివరాలు అగిడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ బి.రాజేశ్ మాట్లాడుతూ దంపతులు బుజ్జి, రామా శనివారం రాత్రి గొడవ పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో బుజ్జికి గొంతుపై తీవ్ర గాయమై మృతి చెందిందన్నారు. రామాకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారకస్థితికి చేరుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి పడిపోయాడన్నారు. స్థానికుల సమాచారంతో రామాను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో భర్త.. ఆస్పత్రికి తరలింపు
దంపతులు గొడవ పడి పరస్పరం
దాడి చేసుకున్నారంటున్న పోలీసులు
కలకలం సృష్టించిన ఘటన
హూన్యాతండాలో మహిళ హత్య
Comments
Please login to add a commentAdd a comment