సీఎం సభలో తెలంగాణ ఉద్యమ కళాకారుల నిరసన
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని శివునిపల్లిలో ఆదివారం జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి సభలో తెలంగాణ ఉద్యమ కళాకారులు నిరసన తెలిపారు. సభా వేదికపై సీఎం ప్రసంగిస్తుండగా కళాకారులు మట్టెడ కలవేని రాణి, పుష్ప తదితరులు తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఫ్లెక్సీని ప్రదర్శించారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులు వారి వద్ద ఉన్న ఫ్లెక్సీని లాగేశారు. గమనించిన సీఎం వారిని వారించారు. కాగా, సీఎం ప్రసంగం అనంతరం ఉద్యమ కళాకారులు తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని నెట్టేశారు. ఈ క్రమంలో ఉద్యమ కళాకారులు, మహిళా పోలీసులకు మధ్య స్వల్ప పెనుగులాట జరిగింది. వారిని సభావేదిక నుంచి మహిళాపోలీసులు బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ తాము శాంతియుతంగా తమ సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చామని, పోలీసులు అత్యుత్సాహంతో తమపై దాడి చేశారన్నారు. ఈ దాడిలో ఫ్లెక్సీని చింపివేశారని, పుస్తెలతాడు తెంపారని, పుస్తెలతాడు లాకెట్‌తోపాటు ఒకరి గోల్డ్ రింగ్ పోయిందని వాపోయారు. తాము ప్రజాస్వామ్యయుతంగా సమస్యను తెలిపేందుకు వస్తే అడ్డుకోవడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 550 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించారని, తెలంగాణ కోసం తాము పాటలు, ధూంధాంలతో ఉద్యమించామని, గుర్తించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కళాకారులు పరకాల రమ, పుష్పలత, అడ్డూరి అంజలి, అలేఖ్య, రాణి, రమ, లావణ్య తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment