అడ్డదారి లైసెన్స్‌లకు చెక్
వాహనం సరిగా నడపగలిగితేనే లైసెన్స్.. లేదంటే అంతే
స్మార్ టెస్ట్ ట్రాక్ ఏర్పాటుకు ప్రణాళికలు రెడీ
● ట్రాక్‌పై డ్రైవింగ్ పరీక్ష పద్ధతికి స్వస్తి
● ఉమ్మడి జిల్లాలో అన్ని ఆర్టీఏల్లో స్థలాల సేకరణకు చర్యలు
● ఇప్పటికే ఆయా కలెక్టర్లకు
ఆర్టీఓల వినతి
ఖిలా వరంగల్ : రహదారులపై ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా వాహనాలు. లక్షలాది సంఖ్యలో బైకుల.. వేలాది సంఖ్యలో కార్లు కనిపిస్తున్నాయి. అయితే వీటన్నింటినీ నడిపే వారికి లైసెన్స్ ఉందా అంటే.. కొందరికి మాత్రమే ఉంటోంది. మరికొందరికి ఉండడం లేదు. మరి ఉన్నవాళ్లయినా సక్రమంగా తీసుకున్నారా అంటే.. బ్రోకర్ల ద్వారా అడ్డదారుల్లో తీసుకుంటున్నారు. ఫలితంగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో రవాణాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పాత విధానం ట్రాక్‌పై డ్రైవింగ్ పరీక్ష పద్ధతికి చెక్ పెడుతూ.. స్మార్ట్ సెన్సార్ కెమెరాల నిఘాతో అధునాతన ట్రాక్‌పై కొత్త పరీక్ష తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల అడ్డదారిలో లైసెన్స్‌లు తీసుకునే వాహనచోదకులకు చెక్ పడనుంది.
అడ్డదారులు మూత!
ప్రస్తుతం.. ప్రతి ఇంట్లో ద్విచక్రవాహనం తప్పని సరి అయ్యింది. కొన్ని ఇళ్లల్లో ఒకటికి మించి ఉంటున్నాయి. ఆర్థికంగా ఉన్న వారు కారు కూడా కలిగి ఉంటున్నారు. ఫలితంగా రోజు రోజుకూ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగిపోతున్నాయి. అందుకు నిదర్శనమే రహదారులపై పెరిగిపోతున్న ట్రాఫిక్ జామ్. కొంత మంది డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన లేకుండానే రోడ్డెక్కేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరి వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదా.. అంటే ఉంటుంది. కానీ అది అడ్డదారిలో తీసుకున్నదై ఉంటుంది. డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన లేకుండా వాహనాలతో రోడ్కెక్కడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకు అడ్డదారుల్లో డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందడమే కారణమని గ్రహించిన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్త పరీక్ష ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఉన్న మ్యానువల్ పరీక్షను తీయడానికి నిర్ణయం తీసుకున్నారు.
ఆధునికతకు చర్యలు..
తాజాగా వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ఆధునీకరించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. అందుకోసం ప్రస్తుతం కొనసాగుతున్న పాత విధానం కంటే మరింత ప్రామాణికంగా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆటోమేటిక్ స్మార్ట్ సెన్సార్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు స్థలాల సేకరణలో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో అడ్డదారిలో డ్రైవింగ్ లెసెన్స్ పొందడం కష్టమే..
వాహనం నడిపితేనే లైసెన్స్..
త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న కొత్త పద్ధతిలో రహదారులపై నిత్యం ఎదురువుతున్న ఇబ్బందులను డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌పై కృత్రిమంగా కల్పిస్తారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు తప్పని సరిగా పరీక్ష రాయాల్సిందే.. ట్రాక్ మీద వాహనం నడిపిన తర్వాతే లైసెన్స్ పొందుతారు. అయితే ట్రాక్ మీద వాహనం నడిపేటప్పుడు కంప్యూటర్‌లో రికార్డవుతుంది. ఏదైనా చిన్న తప్పు చేసినా పరీక్ష ఫెయిల్ అయినట్లే..
కొత్త పద్ధతులు ఇలా..
కొత్తగా ఆర్టీఏ అమలు చేయబోయే ఆటో మెటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ పరీక్షలో 5 ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు. ముందు ‘హెచ్’ అనే ట్రాక్‌లో ఆర్టీఏ ప్రమాణాల్లో పేర్కొన్న విధంగా వాహనాన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘ఎస్’ అనే ట్రాక్‌లో ఒక మూల నుంచి మరో మూలకు వాహనాన్ని టర్న్ చేయాలి. అలాగే ‘కే’ అనే ట్రాక్‌లో బాగా మలుపులు, ఎత్తు పల్లాలు, ఎత్తయిన ప్రదేశాలు, చిన్న లోయలు వంటింటి ఏర్పాటు చేస్తారు. ఆ ట్రాక్‌లో వాహనాన్ని నడిపి చివరిగా పార్కింగ్ చేసి చూపించాల్సి ఉంటుంది. అయితే ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు డ్రైవింగ్ చేసే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్‌లో రికార్డవుతుంది. వాహనాన్ని నడిపేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేసినా కంప్యూటర్‌లో రికార్డు అవుతుంది. ఏ చిన్న మిస్టేక్ చేసినా టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లు చూపిస్తుంది. ఒక వేళ పరీక్షలో ఫెయిలైతే మరో నెల పాటు శిక్షణ తీసుకుని రమ్మంటారు. పూర్తిగా కంప్యూటరీకరణ కావడం వల్ల ఇక్కడ అధికారులను సిబ్బందిని మేనేజ్ చేసేందుకు ఏమాత్రం అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. బ్రోకర్లకు కూడా ఎలాంటి అవకాశం ఉండదని చెబుతున్నారు. దీంతో అడ్డదారుల్లో లైసెన్స్ పొందడం ఇక కష్టతరం కానుంది.
ట్రాక్ స్థలం కోసం వినతిపత్రం అందజేశాం
అధునాతన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ కోసం వరంగల్ ఆర్టీఏకు 5 ఏకరాల భూమి అవసరం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇటీవల కలెక్టర్‌ను కలిసి స్థలం కావాలని కోరుతూ వినతిపత్రం అందజేశాం. కలెక్టర్ సానుకూలంగా స్పందించి స్థలం ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారు.
– శోభన్‌బాబు, ఇన్‌చార్జ్ ఆర్టీఏ, వరంగల్
ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతి..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లిలో రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో వరంగల్‌లో తప్ప మరెక్కడా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లేదు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలో ఆధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం వచ్చే వారికి వరంగల్ రవాణాశాఖ తనిఖీ అధికారులే పరీక్షలు నిర్వహించి లైసెన్స్‌లు అందజేసే పద్ధతి చాలాకాలం నుంచి కొనసాగుతోంది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వరంగల్ ఆర్టీఏకు 5 ఎకరాలు, మిగతా జిల్లాలో రోడ్డు పక్కాన 10 ఎకరాల స్థలాలు కావాలంటూ ఆర్టీఏ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇటీవల వినతి పత్రాలు అందజేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు కావాల్సిన స్థలాల కోసం పరిశీలిస్తున్నారు.
అడ్డదారి లైసెన్స్‌లకు చెక్
అడ్డదారి లైసెన్స్‌లకు చెక్
Comments
Please login to add a commentAdd a comment