దైవదర్శనానికి వస్తూ.. అనంతలోకాలకు
హసన్‌పర్తి: దైవదర్శనానికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి పరకాల–కిట్స్ కళాశాల ప్రధాన రహదారిలోని ముచ్చర్ల క్రాస్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఖిలా వరంగల్ తూర్పుకోటకు చెందిన మేకల సుశాంత్(19), మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కురు గ్రామానికి చెందిన తాండ్ర విజయ్(19), జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన సి.వర్ధన్ (18) స్నేహితులు. సుశాంత్ పరకాలలోని పాలిటెక్నిక్‌లో థర్డ్ ఇయర్ చదువుతుండగా, వర్ధన్ అదే కళాశాలలో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అభ్యసిస్తున్నాడు. విజయ్ మాత్రం పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీరు ముగ్గురు అదే ప్రాంతంలోని బీసీ హాస్టల్ ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు.
రాత్రి 9.30 గంటలకు
హాస్టల్ నుంచి జాతరకు..
ఆదివారం రాత్రి 9.30గంటలకు సుశాంత్, విజయ్, సి. వర్ధన్ పరకాల నుంచి బైక్‌పై ఎర్రగట్టు జాతరకు బయలుదేరారు. సుశాంత్ బైక్ నడుపుతుండగా, విజయ్, వర్ధన్ వెనుక కూర్చున్నారు. వీరితో పాటు మరికొంత మంది విద్యార్థులు కూడా వారి వెంట తమతమ బైక్‌లపై జాతరకు పయనమయ్యారు. సుశాంత్ నడుపుతున్న బైక్ ముచ్చర్ల శివారులోని జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతానికి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ఆస్పత్రికి తరలింపు..
వెనుక నుంచి బైక్‌లపై వస్తున్న స్నేహితులు క్షతగాత్రులను 108లో ఎంజీఎం తరలించారు. అప్పటికే సుశాంత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూ విజయ్ సోమవారం తెల్లవారు ప్రాణాలు వదిలాడు. వర్ధన్ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడు సుశాంత్ తండ్రి సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
మరొకరికి తీవ్ర గాయాలు
ముచ్చర్ల క్రాస్ సమీపంలో ఘటన
దైవదర్శనానికి వస్తూ.. అనంతలోకాలకు
Comments
Please login to add a commentAdd a comment