సినీఫక్కీలో హరిబాబు కోర్టుకు..
న్యాయస్థానం వెనుక గేటు నుంచి రిమాండ్‌కు తరలింపు
భూపాలపల్లి : సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడు హరిబాబు, అతడి పరారీకి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు కోర్టుకు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. కోర్టుకు రాజలింగమూర్తి భార్య సరళ, బంధువులు రావడం.. అక్కడే కొంతమంది బీఆర్‌ఎస్ నాయకులు కూడా ఉండడంతో సుమారు అరగంటపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఉదయం 9 గంటలకే కోర్టుకు..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూపాలపల్లి పట్టణానికి చెందిన రాజలింగమూర్తి గత నెల 19న హత్యకు గురి కాగా, ఈ హత్య కేసులో ఏ–8గా ఉన్న నిందితుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, అతడి పరారీకి సహకరించి, వెంటే ఉన్న ములుగు జిల్లాకు చెందిన వట్టే రమణయ్య, రమను ఏ–11, ఏ–12గా చేర్చిన భూపాలపల్లి పోలీసులు మంగళవారం ఉదయం 9 గంటలకే జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపర్చగా నిందితులకు జడ్జి ఎన్. రాంచందర్‌రావు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు నిందితులను ఖమ్మం జైలుకు తరలించారు.
కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత..
కోర్టు వద్ద ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు సినీ ఫక్కీలో హరిబాబు ను రిమాండ్‌కు తరలించారు. రమణయ్య, రమను కోర్టు ముందు గేటు ద్వారా తీసుకెళ్లారు. హరిబాబు ను మాత్రం వెనుక గేటు నుంచి తీసుకెళ్లి పోలీసు వాహనంలో రిమాండ్‌కు తరలించారు. విషయాన్ని గమనించిన సరళ, ఆమె బంధువులు.. హరిబాబు ను తమకు చూపించాలని పోలీసులను డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ నాయకులను సరళ నిలదీసింది.
ఏ11, ఏ12కు బెయిల్?
హరిబాబు పరారీకి సహకరించి, అతడి వెంట ఉన్న రమణయ్య, రమకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిసింది. జమానతులు సమర్పిస్తే నేడు బెయిల్ రానున్నట్లు సమాచారం.
ఆరుగురు నిందితుల కస్టడీకి
పోలీసుల అప్పీలు..
హత్య కేసులో ఏ–1గా ఉన్న రేణికుంట్ల సంజీవ్, ఏ–2 పింగిలి సేమంత్, ఏ–3 మోరె కుమార్, ఏ–4 కొత్తూరి కిరణ్, ఏ–6 దాసారపు క్రిష్ణ, ఏ–8 కొత్త హరిబాబును విచారణ నిమిత్తం ఏడు రోజుల కస్టడీ కోసం పోలీసులు కోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
హరిబాబు బెయిల్ పిటిషన్‌పై
నేడు హైకోర్టులో విచారణ..
కొత్త హరిబాబు పరారీలో ఉండి ఈ నెల 4వ తేదీన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. మూడు, నాలుగుసార్లు వాదనలు జరగగా విచారణ మంగళవారం(నిన్న)కు వాయిదా పడగా అదే రోజున హరిబాబును పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో హరిబాబు తరపున లాయర్ ముందస్తుకు బదులు సాధారణ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా బుధవారం విచారణ జరగనున్నట్లు సమాచారం.
ముగ్గురి అరెస్ట్..
రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు కొత్త హరిబాబుతో పాటు, అతడు పారిపోవడానికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ డి. నరేశ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాకు చెందిన వట్టే రమణయ్య, రమ.. హరిబాబు పారిపోవడానికి సహకరించారని, ముగ్గురిని ఒకే దగ్గర అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.
హరిబాబుతోసహా మరో ఇద్దరు సహాయకుల అరెస్ట్, కోర్టులో హాజరు
కోర్టుకు వచ్చిన రాజలింగమూర్తి భార్య సరళ, బంధువులు
నిందితుడిని చూపించాలని డిమాండ్
అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ నాయకుల నిలదీత .. అరగంటపాటు ఉద్రిక్తత
హరిబాబు పరారీకి సహకరించిన ఇద్దరికి బెయిల్ మంజూరు?
సినీఫక్కీలో హరిబాబు కోర్టుకు..
Comments
Please login to add a commentAdd a comment