సామాజిక అభ్యున్నతికి దోహదం
భారత రాజ్యాంగం..
కేయూ క్యాంపస్ : భారత రాజ్యాంగం సామాజిక వ్యవస్థ అభ్యున్నతికి దోహదపడుతున్న విలువైన డాక్యుమెంట్ అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నారాయణ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ‘75 ఏళ్ల భారత రాజ్యాంగం మైలు రాయి.. సమస్యలు– సవాళ్లు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం సెనేట్‌హాల్‌లో నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతీయ సమాజం విభిన్న సంస్కృతుల జాతుల కలయిక అని, ఇండియాలో నివసించే వ్యక్తులందరూ రాజ్యాంగం పరిధిలో జీవిస్తున్నారన్నారు. సమసమాజ స్థాపనకు భారత రాజ్యాంగ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సెక్యులర్ భావాలతో రాజ్యాంగంలో పేర్కొన్న ప్రతీ ఆర్టికల్ దేశ ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు.
మానవ అభివృద్ధికి విద్య దోహదం..
మానవ అభివృద్ధికి విద్య ఎంతో దోదపడుతుందని తెలంగాణ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య అన్నారు. బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు సమాజ అభ్యున్నతికి దోహదపడుతున్నాయన్నారు. భగవద్గీత, వేదాలు ఉపనిషత్తులు, అన్ని గ్రంథాలతోపాటు రాజ్యాంగాన్ని కూడా ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అధిక నిధులు కేటాయించాలన్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలి..
ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో విలువలు లేవని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదని, అందుకే ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలని కేయూ మాజీ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దేశంలో నిజాయితీ గల రాజకీయ వ్యవస్థ లేకుండా పోయిందన్నారు.
సెక్యులర్ భావాలు కలిగిన వ్యవస్థ..
ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగ వ్యవస్థను కలిగిన భారతదేశంలో భిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు ఉన్నాయని, ముఖ్యంగా సెక్యులర్ భావాలతో కలిగిన వ్యవస్థ ఉందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ అన్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రజాపాలనలో అనేక సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోందన్నారు. యూనివర్సిటీల్లో కూడా టీచింగ్ ఫ్యాకల్టీని నియమించబోతున్నారని వెల్లడించారు. అనంతరం కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, కేయూ ఎస్సీ,ఎస్టీ సెల్ డైరెక్టర్, సెమినార్ డైరెక్టర్ తుమ్మల రాజమణి, ఓయూ ‘లా’ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ద్వారకానాథ్ మాట్లాడారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, సైన్స్‌కోర్సుల డైరెక్టర్ బి. వెంకటగోపినాథ్, డాక్టర్ మేఘనరావు, డాక్టర్ ప్రగతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏపీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ నారాయణ
కేయూలో జాతీయ సదస్సు ప్రారంభం
సామాజిక అభ్యున్నతికి దోహదం
సామాజిక అభ్యున్నతికి దోహదం
Comments
Please login to add a commentAdd a comment