సాంకేతిక లోపంతో నిలిచిన గూడ్స్..
● 2 గంటల పాటు ఆగిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్లు
● తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రయాణికులు
డోర్నకల్/గార్ల: డోర్నకల్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి మెయిన్ లైన్‌లో నిలిచింది. దీంతో మంగళవారం పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉదయం 6 గంటల సమయంలో బొగ్గు లోడ్‌తో వరంగల్ వైపునకు వెళ్తున్న గూడ్స్ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి నిలిచింది. దీంతో డోర్నకల్‌లో కాకతీయ రైలు 2.10 గంటల వరకు నిలిచింది. గుండ్రాతిమడుగులో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ 2.20 గంటలు, గార్లలో ఏపీ ఎక్స్‌ప్రెస్ 2.10 గంటల వరకు నిలిచిపోగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ డోర్నకల్ అవుట్ సిగ్నల్ వద్ద గంట పాటు, సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ పోచారం రైల్వే స్టేషన్‌లో రెండు గంటల పాటు నిలిచాయి. మహబూబాబాద్ వైపు నుంచి రిలీఫ్ రైలింజన్ వచ్చి గూడ్స్‌ను మహబూబాబాద్‌కు తరలించిన అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. రెండు గంటలకు పైగా రైళ్లు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బ్రిడ్జిపై స్తంభించిన రాకపోకలు..
డోర్నకల్: స్థానిక రైల్వే స్టేషన్‌లోని ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై మంగళవారం కొద్దిసేపు రాకపోకలు స్తంభించాయి. ఉదయం సింగరేణి, శాతవాహన రైళ్లు ఆలస్యంగా నడవడం, మహారాష్ట్రకు వెళ్తున్న కూలీలు బ్రిడ్జిపై తమ సామాన్లతో కూర్చోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఆర్‌పీఎఫ్ సిబ్బంది స్పందించి బ్రిడ్జికి ఇరుపక్కలా కూర్చున్న కూలీలను ప్లాట్‌ఫామ్‌లపైకి తరలించి రాకపోకలను పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment