విద్య, వైద్య రంగాలకు కేటాయింపులపై భిన్నస్వరాలు | - | Sakshi
Sakshi News home page

విద్య, వైద్య రంగాలకు కేటాయింపులపై భిన్నస్వరాలు

Published Thu, Mar 20 2025 1:48 AM | Last Updated on Thu, Mar 20 2025 5:58 PM

-

అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, ఎయిర్‌పోర్టు, ‘సూపర్‌’ ప్రస్తావన లేదు

కాళేశ్వరానికి రూ.2,685 కోట్లు.. దేవాదులకు రూ.245 కోట్లు

స్మార్ట్‌సిటీకి రూ.179కోట్లు, కేయూసీ, జీడబ్ల్యూఎంసీకి రూ.100 కోట్లు

రామప్ప, పాకాలకు రూ.ఐదేసి కోట్లు.. ‘కాళోజీ’కి రూ.రెండు కోట్లే

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఊతం

ఎకో టూరిజం ప్రస్తావన.. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆశలు

అసెంబ్లీలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2025–26 రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్‌కు దక్కిన ప్రాధాన్యంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రెండో రాజధానిగా హైదరాబాద్‌కు పోటీగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం.. బడ్జెట్‌లో ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు చేసిన కేటాయింపుల్లోనే ఉమ్మడి వరంగల్‌కు ప్రయోజనాలు కలుగుతాయన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. 

ముఖ్యమంత్రిగా మొదటిసారి వరంగల్‌ నగరంలో పర్యటించిన రేవంత్‌రెడ్డి.. నగరం అభివృద్ధి కోసం 8 అంశాలు ప్రాధాన్యంగా రూ.6,115 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇన్నర్‌, ఔటర్‌ రింగు రోడ్లు, మామునూరు ఎయిర్‌పోర్టు తదితర అంశాలు అందులో ఉన్నాయి. వీటికి నేరుగా నిధులు ఇచ్చేలా ప్రతిపాదనలు చేసినట్లు బడ్జెట్‌లో కనిపించ లేదు. కాగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిందన్న చర్చ ఉంది.
– సాక్షి ప్రతినిధి, వరంగల్‌

సంక్షేమం, ఐటీ, అభివృద్ధిపైన ఆశలు..
ఎస్సీ, బీసీ, ఎస్టీ, మహిళా సంక్షేమం కోసం ఈసారి భారీ కేటాయింపులే జరిగాయి. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా కలిగిన జిల్లాలో ఆ వర్గాలకు మేలు జరుగనుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ సంక్షేమం కోసం రూ.40,232, ఎస్టీలకు రూ.17,169 కోట్లు కేటాయించడం పట్ల ఉమ్మడి వరంగల్‌కు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ఐటీ, పరిశ్రమల రంగంపైన దృష్టి సారించిన నేపథ్యంలో రెండో నగరంగా వరంగల్‌ వృద్ధి చెందుతుందన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండగా, ఐటీ హబ్‌, టెక్స్‌టైల్‌ పార్కు, మడికొండ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలపై ఆశలు రేకెత్తుతున్నాయి. ఎకో టూరిజానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ములుగు, జేఎస్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలకు మహర్దశ రానుంది.

విద్యారంగానికి మంచి రోజులు..
ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈసారి రూ.23,108 కోట్లు కేటాయించింది. దీంతో సర్కారు చదువులకు ఇంకా మంచి జరగనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 20–25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి జిల్లాకు రూ.1400 కోట్లతో ఏడింటిని మంజూరు చేసింది. ఈ బడ్జెట్‌తో ఈసారి ఆ స్కూళ్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్‌లో మొత్తం 3,331 ప్రభుత్వ బడులు ఉండగా, అందులో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీలతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించే అవకాశం ఉంది.

బడ్జెట్‌పై వివిధ వర్గాల అభిప్రాయాలు
రైతులు, రైతుకూలీలకు బీమా..
ఉమ్మడి వరంగల్‌లో 15,01,109 ఎకరాల్లో 4,33,229 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 4,09,098 మంది రైతులకు బీమా సౌకర్యం కొనసాగనుంది. 9,02,099 ఎకరాలకు పంటల బీమా వర్తించనుంది. అలాగే, రైతు కూలీలకు బీమా వర్తింపజేసే ప్రతిపాదనలు తక్షణమే అమల్లోకి వస్తే.. ఉమ్మడి జిల్లాలో 18,45,326 మందికి ప్రయోజనం కలుగుతుంది.

మహిళలకు పెద్దపీట
ప్రతి మండలంలో మహిళలతో రైస్‌ మిల్లులు, మినీ గోదాముల ఏర్పాటు.. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్‌ మిల్లుల్లో మిల్లింగ్‌ చేయిస్తాం, మహిళా స్వయం సహాయక సంఘాలకు మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యత అప్పగిస్తామని ప్రకటించారు. దీంతో ఉమ్మడి వరంగల్‌లోని 48,717 మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 8,76,906 మందికి లబ్ధి చేకూరనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement