అద్దం లేక అపాయం!
వాహనాలకు సైడ్ మిర్రర్ లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఈ ఘటనల్లో ద్విచక్రవాహనాలే ఎక్కువ నిర్లక్ష్యం.. అతివేగమే ప్రధాన కారణాలు నగరంలో పెరుగుతున్న యాక్సిడెంట్లు బైక్ అద్దాలపై అవగాహన పెంచాలంటున్న ప్రజలు..
వాహనాలకు సైడ్ మిర్రర్లు తప్పనిసరి
వాహనాలకు సైడ్ మిర్రర్ ఉంటే చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయి. నగరంలో చాలా ఘటనల్లో వెనుక వచ్చే వాహనాలు చూసుకోక పక్కకు తిప్పడం వల్లే ప్రమాదాలు జరిగాయి. ద్విచక్రవాహనాలతో పాటు ఆటోలు, కార్లు సైడ్ మిర్రర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చు. అంతేకాకుండా హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే సురక్షితంగా గమ్యం చేరుకోవచ్చు.
– శోభన్‌బాబు ఇన్‌చార్జ్ ఆర్టీఓ వరంగల్
ఖిలా వరంగల్ : ఏ వాహనానికైనా సైడ్ మిర్రర్ తప్పనిసరి.. వెనుక నుంచి వస్తున్న వాహనాలు కనిపించాలంటే అద్దం కచ్చితంగా ఉండాలి. అప్పు డే రోడ్డు ప్రమదాలు జరగవు. అయితే చాలా మంది అద్దం లేకుంటే ఏమవుతుందిలే అనుకుంటున్నారు. చిన్న పొరపాటే ప్రాణాల మీదికి తెస్తోంది. కేవలం అద్దం లేకపోవడంతోనే ఇటీవల పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బైక్ అందం పాడు చేస్తుందని కొంత మంది అద్దాలు తీసేస్తున్నారు. ఫలితంగా వెనుక నుంచి వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాల సంభవిస్తున్నాయి. వీరిలో 80 శాతం మందికి సైడ్ మిర్రర్ లేకపోవడంతో అపరాధ రుసుం వేసినా మారడం లేదు. తమ వాహనాలకు అద్దం ఏర్పాటు చేసుకోవడం లేదు.
రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు..
వరంగల్ జిల్లాతోపాటు నగరంలో రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిండు ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి. దీనికి ప్రధానం కారణం సైడ్ మిర్రర్ లేకపోవడమేనని తెలుస్తోంది. యువత బైక్‌కు అద్దాలు తీసి వాహనంపై అతివేగంగా ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తు, సెల్‌ఫోన్ డ్రైవింగ్ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు.
తొందరపాటు ఎందుకు?
యువతలో హడావిడిగా బయల్దేరే వారే ఎక్కువ ఉంటున్నారు. సమయం మించి పోతుందనే ధోరణిలో వేగంగా వెళ్తుంటారు. అందుకే ప్రయాణంపై ముందస్తు ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి.
హెల్మెట్‌తో లాభం..
ప్రమాదాల సమయంలో హెల్మెట్ వాహనదారులకు రక్షణ కవచంగా నిలుస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగి బైక్ నుంచి కిందపడిన సందర్భంలో తలకు గాయాలవ్వకుండా హెల్మెట్ నిలువరిస్తుంది. ద్విచక్రవాహనంపై ప్రయాణం చేస్తున్న సమయంలో దుమ్ము, ఎండ నుంచి హెల్మెట్ రక్షణగా ఉంటుంది. వేగం కన్నా ప్రాణం ముఖ్యమనే అంశం ప్రతీ వాహనదారుడు గుర్తుంచుకోవాలి.
ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రాణాలకు ముప్పు
బాలురు, యువకులు డ్రైవింగ్ మీద అవగాహన లేక మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. యువత ద్విచక్రవాహనాలు నడిపే సమయంలో స్పీడ్ కంట్రోల్ చేసి నడిపితే క్షేమం. 18 నుంచి 20 సంవత్సరాల్లోపు యువకులు ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు.
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
యువత మద్యం తాగి మాకేం కాదులే అని వాహనాలు నడుపుతోంది. భారీ వాహనాలను వెనుక నుంచి అనుసరించడం, ఎదుటి వాహనాలను పట్టించుకోకుండా ఓవర్‌టేక్ చేయడం ప్రమాదకరం. వి న్యాసాలు చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
నిర్లక్ష్యం వద్దు..
రోడ్డుపై అప్పటి వరకు వరకు నెమ్మదిగా వెళ్తున్న వారు కూడా వెనుక నుంచి క్రాస్ చేసిన వారిని ఓవర్‌టేక్ చేయాలని దూసుకెళ్తారు. ఇందుకోసం వాహన వేగం పెంచుతున్నారు. ఇలాంటివి వద్దు.
శిక్షణ లేకుండా వద్దు..
అత్యధిక శాతం మంది సరైన శిక్షణ లేకుండానే బైక్ నడుపుతున్నారు. ఇంటి వద్దకు వచ్చిన బైక్‌ను సరదాగా బయటకు తీయడం వంటివి చేసి తమకు బైక్ నడపడం వచ్చిందనే భ్రమలో రోడ్డు ఎక్కుతున్నారు. ఈవిషయంలో తల్లిదండ్రులే అప్రమత్తంగా ఉండాలి.
సిగ్నల్స్ చూసుకోండి..
రహదారులపై వాహనాల సంఖ్య భారీగా పెరిగాయి. దీంతో కూడళ్ల వద్ద వాటిని నియంత్రించేందుకు సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చే వారికి ఈ విషయంపై సరైన అవగాహన ఉండడం లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిపై అందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
అద్దం లేక అపాయం!
అద్దం లేక అపాయం!
Comments
Please login to add a commentAdd a comment