ఎమ్మార్టీలో పదోన్నతి ఎప్పుడు?
హన్మకొండ: తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఎమ్మార్టీ విభాగంలో పదోన్నతి కల్పించడంలో జాప్యం జరుగుతున్నా కొద్దీ.. ఉద్యోగుల్లో ఆందోళన పెరిగిపోతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి 16 సర్కిళ్ల (జిల్లా)లో 16 ఎమ్మార్టీ డివిజన్లున్నాయి. ఈడివిజన్లలో అన్ని కేడర్లు కలిపి 285 పోస్టులున్నాయి. ఇందులో 220 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో లైన్‌మెన్ పోస్టులు 47 ఖాళీగా ఉన్నప్పటికీ పదోన్నతి కల్పించి భర్తీ చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఎమ్మార్టీ విభాగానిది కీలక భూమిక. సబ్ స్టేషన్లు, డీటీఆర్‌ల నిర్వహణలో వీరి పాత్ర ముఖ్యమైంది. వీటితో పాటు సిటీ మీటర్స్, హెచ్‌టీ మీటర్స్, ఎల్‌టీ మీటర్స్ రోటేషన్ పద్ధతిలో పరీక్షిస్తుంటారు. సబ్‌స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల మెయింటెనెన్స్ వీరిదే బాధ్యత. వీరు ఏ మాత్రం అలసత్వం వహించినా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగడమో.. నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడమో జరుగుతుంటుంది. అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల లోపాలను సరిదిద్దేదీ ఈ విభాగ ఉద్యోగులే. విద్యుత్ శాఖలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్న వీరిపై యాజమాన్యం అ నుసరిస్తున్న వివక్షతో వారంతా విసిగిపోతున్నారు.
యాజమాన్యం పట్టించుకోవట్లేదు..
ఎమ్మార్టీలో జూనియర్ లైన్‌మెన్, టెస్టర్ గ్రేడ్–2 (లైన్‌మెన్), టెస్టర్ గ్రేడ్–1 (లైన్ ఇన్‌స్పెక్టర్), ఫోర్‌మెన్ గ్రేడ్–1 పోస్టులున్నాయి. ఆపరేషన్ విభాగంలో మాదిరిగా టెస్టర్ గ్రేడ్–1 తర్వాత సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు సృష్టించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా.. యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫోర్‌మెన్ గ్రేడ్–1 పదోన్నతి కల్పించే క్రమంలో అధికారులు వింత పోకడలు అవలంబిస్తున్నారు. అసలే పోస్టు లేని ఫోర్‌మెన్ గ్రేడ్–2గా డీగ్రేడ్ చేస్తూ ఏడాది తర్వాత ఫోర్‌మెన్ గ్రేడ్–1గా పదోన్నతి కల్పిస్తున్నారు. దీంతో ఒకే వ్యక్తికి ఒక సంవత్సరంలోనే నాలుగు ఇంక్రిమెంట్లు (రెండు పదోన్నతి) ఇస్తున్నారు. డీ గ్రేడ్ చేస్తున్న ఫోర్‌మెన్ గ్రేడ్–2 స్థానంలో సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ పోస్టును క్రియేట్ చేయాలని ఎమ్మార్టీ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఫోర్‌మెన్ గ్రేడ్–1, ఫోర్‌మెన్ గ్రేడ్–2 పదోన్నతి అంశంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఫోర్‌మెన్ గ్రేడ్–1 పోస్టు భర్తీ చేస్తే ఫోర్‌మెన్‌గ్రేడ్–2 ఖాళీగా ఉంటుంది. ఫోర్‌మెన్ గ్రేడ్–2 భర్తీ చేస్తే ఫోర్‌మెన్ గ్రేడ్–1 ఖాళీగా ఉంటుంది. ఈరెండు పోస్టుల్లో ఒకే సారి ఉద్యోగుల భర్తీ కనిపించదు.
ఖాళీగా టెస్టర్ గ్రేడ్–2 (లైన్‌మెన్) పోస్టులు
ప్రమోషన్ కోసం జేఎల్‌ఎంల
ఎదురుచూపులు
20 ఏళ్ల వరకు పదోన్నతి లేదా?
ఎమ్మార్టీ విభాగంలో ఆరేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు పదోన్నతి పొందకుండా ఒకే పోస్టులో కొనసాగుతున్నామని ఎమ్మార్టీ ఉద్యోగులు వాపోతున్నారు. జూనియర్ లైన్‌మెన్లు టెస్టర్ గ్రేడ్–2 పదోన్నతి కోసం గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. టెస్టర్ గ్రేడ్–2 ఉద్యోగులు గ్రేడ్–1 కోసం 10 నుంచి 18 ఏళ్ల నుంచి, టెస్టర్ గ్రేడ్–1 నుంచి ఫోర్‌మెన్ పదోన్నతి కోసం 10 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. టెస్టర్ గ్రేడ్–2 నుంచి పదోన్నతికి అనువుగా పోస్టులు లేక పోవడంతో వీరికి అవకాశం దక్కడం లేదు. పైస్థాయిలో ఉన్న ఉద్యోగులు రిటైర్డ్ అయితేనే పోస్టు ఖాళీ అవుతుంది. అప్పుడే పదోన్నతికి అవకాశముంటుంది. ఈక్రమంలో ఈ పోస్టుల మధ్య కొత్త పోస్టులు క్రియేట్ చేస్తే పదోన్నతి చానల్ పెరుగుతుందని ఎమ్మార్టీ ఉద్యోగులు యాజమాన్యాన్ని కోరుతున్నారు. ఖాళీగా ఉన్న టెస్టర్ గ్రేడ్–2 పోస్టులు 47 ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయకపోవడంతో ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అంతర్యమేంటో అర్థం కావట్లేదని ఉద్యోగులు వాపోతున్నారు. దీంతో ఉద్యోగిగా తమకు రావాల్సిన ప్రయోజనాలను కోల్పోతున్నామని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా తమకు పదోన్నతి కల్పించాలని ఎమ్మార్టీ ఉద్యోగులు కోరుతున్నారు.
ఎమ్మార్టీలో పదోన్నతి ఎప్పుడు?
Comments
Please login to add a commentAdd a comment