
నక్సల్స్ ఉద్యమానికి బాట
కడవెండి పడమటి తోట..
దేవరుప్పుల : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో విస్నూర్ దేశ్‌ముఖ్‌లను ఎదురించి భూమి.. భుక్తి.. బానిస బంధాల విముక్తి పొందిన కడవెండి ప్రజలు నిలువ నీడ కోసం చేసిన పడమటి తోట ఇళ్ల స్థలాల పోరాటం.. నక్సల్స్ ఉద్యమానికి బాట అయ్యింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో 1980లో వామపక్ష పార్టీల నేతృత్వంలో స్థానిక భూస్వామి అస్నాల రాజయ్యకు చెందిన పడమటి తోటలో బీసీ సామాజికవర్గ పేదలు గుడిసెలు వేశారు. ఈ పోరాటానికి తొలుత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నల్లా నర్సింహులు నేతృత్వం వహించినప్పటీకీ సఫలీకృతం కాలేదు. ఈ తరుణంలో కొత్తగా ఆవిర్భవించిన సీపీఐ(ఎంఎల్) నాయకుడు అంజాజీ నేతృత్వం వహించారు. ఈ తరుణంలోనూ సదరు భూస్వామి ఎస్సీ, ఎస్టీలను పురమాయించి ఈ పోరాటానికి చెక్ పెట్టేందుకు యత్నించారు. దీంతో భూపోరాటం నిర్వీర్యమయ్యే క్రమంలో 1982లో రాడికల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో వేసవిలో పల్లె క్యాంపెయిన్‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటికే ‘లా’ విద్యనభ్యసిస్తున్న ఎర్రంరెడ్డి పురుషోత్తంరెడ్డి నివాసిత భూపోరాట విజయం కోసం ఆర్‌ఎస్‌యూ పక్షాన పావులు కదిపారు. ఎస్సీ, ఎస్టీలను చైతన్య పరుచడంతో పడమటి తోట పోరాటానికి వారు సంఘీభావం పలికారు. దీంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఈ విషయంలో అనేక మందిపై కేసులు నమోదైనా పోరాటం తగ్గలేదు. దీంతో భూ యజమాని దిగొచ్చి కేసులు ఉపసంహరించుకున్నా రు. నల్లా నర్సింహులు ఉద్యమ స్ఫూర్తితో అతడి తమ్ముడు నల్ల మల్లయ్య, బావమరిది బిట్ల ముత్తయ్య పడమటి తోట సాఽధించుకునేందుకు దోహదపడ్డారని పురుషోత్తం రెడ్డి పేర్కొనడం గమనార్హం.
పీపుల్స్‌వార్ పార్టీ నిర్మాణంలో
గ్రామస్తుల కీలక పాత్ర..
ఐక్యంగా నిలువ నీడలేని పేదలకు స్థలాల సాధనతో స్థానిక స్టూడెంట్స్, యువత రాడికల్ సంఘం వైపు ఆకర్షితులై రాష్ట్ర ఉత్తర తెలంగాణ స్థాయి పీపుల్స్‌వార్ పార్టీ నిర్మాణంలో గ్రామస్తులు కీలక పాత్ర పోషించేలా ఎదిగారు. ఈ క్రమంలోనే పీపుల్స్ వార్ నాయకులు తుపాకులు చేతబూని సింగిల్ ఆర్గనైజర్ వ్యవస్థ విస్తరించే క్రమంలో ఇళ్ల స్థలాల పోరాట నేపథ్యంలో జనశక్తి, పీపుల్స్‌వార్ మధ్య వైరుధ్యం పెరిగింది. దీంతో ఆధిపత్యం కోసం పురుషోత్తంరెడ్డి అలియాస్ ఎపీకి బదులు పీపుల్స్ వార్‌కు సహకరిస్తున్నాడనే కారణంతో సీతారాంపురంలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఎర్రంరెడ్డి సోమిరెడ్డిని జనశక్తి నక్సల్స్ కాల్చి చంపారు. ఈ ఘటనతో పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైన క్రమంలోనే పురుషోత్తం రెడ్డి వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా, అతడి సోదరుడు ఎర్రంరెడ్డి సంతోశ్‌రెడ్డి ఉస్మానియా విద్యాలయం వేదికగా కొండపల్లి సీతారామయ్య, వరవరరావు ఆధ్వర్యంలో పీపుల్స్‌వార్‌లో పూర్తిస్థాయిలో చేరి పార్టీలో కీలక భూమిక పోషించారు. అప్పట్లో ఇదే గ్రామంలో చారుముజుందార్ వర్ధంతి సభతో నక్సల్స్ ఉద్యమం బలపడింది. ఈ తరుణంలో పీపుల్స్ వార్ పార్టీ, అనుబంధ ప్రజానాట్య మండలి విభాగంలో రాష్ట్ర స్థాయిలో అనేక మంది పనిచేశారు. ఎట్టకేలకు ఐదు దశాబ్దాల నక్సల్స్ ఉద్యమ నేపఽథ్యంలో ఈ గ్రామం నుంచి సంతోశ్‌రెడ్డి అలియాస్ మహేశ్, పైండ్ల వెంకటరమణ, గుమ్ముడవెల్లి రేణుక, పెద్ది శ్రీను, జనశక్తి నేత పెద్ది యాదగిరి ఇతర ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్ పేరిట హతమవడం కొసమెరుపు.
రాడికల్ స్టూడెంట్స్ పల్లె క్యాంపెయిన్‌లతో చైతన్యం
సామాజిక వైరుధ్యాలను అధిగమిస్తూ
ఐక్యతారాగం
పోరాట ఫలితంగా నక్సల్స్‌బరి వైపు అడుగులు
కడవెండి మదిలో అమరుల పోరాట స్మృతులు