
టార్గెట్.. 2.50 లక్షల మంది
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : వరంగల్ వేదికగా ఈ నెల 27న బీఆర్‌ఎస్ మరోసారి ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించేందుకు బుధవారం అంకురార్పణ జరిగింది. పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల మహాసభ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, సభా పర్యవేక్షకులు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీష్ కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నరేందర్, ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్‌చార్జ్ గ్యాదరి బాలమల్లు తదితరులు భూమి పూజ చేశారు. అంతకుముందు మంగళవారం ఎర్రవెల్లిలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన ముఖ్యనేతలతో సమావేశమైన అధినేత కేసీఆర్.. సభావేదిక, జనసమీకరణ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. 10లక్షల మందికిపైగా బహిరంగసభ నిర్వహించాలని, దీనికి కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి 2.50లక్షలమంది జనాన్ని సమీకరించాలని టార్గెట్ పెట్టారు.
జనసమీకరణకు ఇన్‌చార్జ్‌లు..
కేసీఆర్ ఆదేశాలతో 2.50లక్షలమంది జనసమీకరణకు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అధినేత.. సభా ఏర్పాట్లు, జన సమీకరణకు సంబంధించి ముఖ్యనేతలకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. పాలకుర్తి, వర్ధన్నపేటలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనుండగా.. వరంగల్ పశ్చిమను మాజీ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్‌కు అప్పగించారు. వరంగల్ తూర్పును నన్నపునేని నరేందర్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలకు, భూపాలపల్లిని గండ్ర వెంకటరమణారెడ్డికి, నర్సంపేట, ములుగు నియోజకవర్గాలకు పెద్ది సుదర్శన్ రెడ్డిలను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. అదేవిధంగా జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ బాధ్యతలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చూడనుండగా, పరకాలను చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్‌ను సత్యవతి రాథోడ్, శంకర్‌నాయక్‌లు, డోర్నకల్‌ను రెడ్యానాయక్, మాలోత్ కవితలకు అప్పగించారు. సభ ఏర్పాట్లు, జనసమీకరణ తదితర బాధ్యతలు నిర్వహించే హైదరాబాద్‌కు చెందిన పార్టీ రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు వరంగల్ నగరంలోనే మకాం వేయనున్నారు.
నేటినుంచి మరింత వేగంగా పనులు..
సభకు మరో 24 రోజులే గడువు ఉండటంతో గురువారం నుంచి సభా కోసం చేపట్టే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు బహిరంగసభకు సిద్ధం చేసిన 1,213 ఎకరాల స్థలంలో.. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఉంటుందని, పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించిన బీఆర్‌ఎస్ నేతలు, మరో మూడు, నాలుగు వందల ఎకరాలు కూడా సమీకరించనున్నట్లు వివరించారు.
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడిజిల్లానుంచి జనసమీకరణ
జన సమీకరణకు ఇన్‌చార్జులుగా
మాజీ మంత్రులు,
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఇప్పటికే కేసీఆర్‌తో భేటీ అయిన
ముఖ్య నేతలు