
గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్ట్
వరంగల్ క్రైం : గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 16 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం హనుమకొండ పీఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుజరాత్‌లోని బైరాజీకివాడి వడోదరాకు చెందిన గౌతమ్ భరత్ సింధే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి రైళ్లలో సమోసాలు అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు. ఈ క్రమంలో ముంబాయికి చెందిన అర్జున్.. గంజాయి సరఫరా చేస్తే రూ. 5వేలు ఇస్తానని చెప్పగా గౌతమ్ ఒప్పుకున్నాడు. దీంతో నవంబర్‌లో గౌతమ్ ఒడిశాలోని బాలుగం రైల్వే స్టేషన్ వెళ్లి అక్కడ నెహ్రూబాయ్ అనే వ్యక్తి ఇచ్చిన గంజాయి తీసుకుని ముంబైకి వెళ్లి అర్జున్‌కు అప్పగించగా రూ. 5 వేలు ఇచ్చాడు. నాలుగు రోజు క్రితం కూడా మళ్లీ ఇదే తరహాలో గౌతమ్ ఒడిశా వెళ్లి గంజాయి తీసుకుని కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. ఈ క్రమంలో రైలులో పోలీసులు గంజాయి గుర్తించి తనిఖీ చేస్తున్నారని తెలియడంతో బుధవారం వరంగల్ రైల్వేస్టేషన్‌లో రైలు దిగాడు. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఆటోలో హనుమకొండ బస్టాండ్‌కు చేరుకున్నాడు. ఇక్కడ ఎస్సై కిశోర్, సిబ్బందికి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అదుపులోకి తీసుకునే క్రమంలో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకుని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. దీంతో అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు.
16 కిలోల సరుకు స్వాధీనం