
ఫ్రస్ట్రేషన్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ
ధర్మసాగర్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీలు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాయని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. మండల కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నాయని, హెచ్‌సీయూ పక్కన ఉన్న భూములపై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ భూములు ప్రభుత్వానివేనని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నామని, రాష్ట్రానికి అప్పులు పుట్టే పరిస్థితి లేదని, కేంద్ర మంత్రులు పరిపాలనపై కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సన్నబియ్యం కిలో రూ.40 అయితే రూ.30 కేంద్ర ప్రభుత్వం ఇస్తే, రూ.10 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని, కనీసం అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గు చేటని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హెచ్‌సీయూ పక్కనున్న భూములు ప్రభుత్వానివేనని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు అదే నాయకులు ఆ భూములు ప్రభుత్వానివి కావని అనడంలో రాజకీయం తప్ప మరొకటి లేదని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడంతో ఇప్పుడు ఎక్కడికెళ్లినా అప్పు పుట్టే పరిస్థితి లేదని తెలిపారు. ఆ భూములను అమ్మడం ద్వారా వచ్చే డబ్బుతో పేదల సంక్షేమానికి ఉపయోగించాలని ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, ఎర్రబెల్లి శరత్,కూనూరు రాజు, రొండి రాజు, పాషా పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి