హన్మకొండ: రైతు సమస్యలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణ మాఫీ చేయడంలో విఫలమైందని విమర్శించారు. యాసంగి పంట కాలం పూర్తయి.. వానా కాలం సాగు సమీపిస్తున్నా ఇప్పటికీ యాసంగి కాలానికి ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి రూ.6 వేలు క్రమం తప్పకుండా ఇస్తోందని చెప్పిన ఆయన.. కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో అనేక వాగ్దానాలు చేసి ఏ ఒక్కటీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నదని విమర్శించారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఎంత మందికి రుణ మాఫీ జరిగిందో తెలియజేస్తూ శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు చేయడంతోపాటు రైతు భరోసా రైతులందరికీ చెల్లించాలని డిమాండ్ చేశారు. పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ ఆజ్మీరా సీతారాం నాయక్, వరంగల్, జేఎస్‌భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, నిశిధర్ రెడ్డి, సిరికొండ బలరాం, సౌడా రమేష్, నాయకులు వన్నాల శ్రీరాములు, రావు పద్మ, ఎరబ్రెల్లి ప్రదీప్‌రావు, కుసుమ సతీష్, మల్లాడి తిరుపతిరెడ్డి, రత్నం సతీష్, గోగుల రాణా ప్రతాపరెడ్డి, బైరి నాగరాజు, పుల్యాల రవీందర్ రెడ్డి, ఎం.విష్ణు, డాక్టర్ కాళీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి