
మళ్లొస్తానని వెళ్లి.. మృత్యుఒడికి..
పొలం వద్ద విద్యుదాఘాతం.. దడువాయి మృతి
జనగామ : పొలం వద్దకు వెళ్తున్నా.. మళ్లొస్తా అంటూ బయలుదేరిన కొద్ది సేపటికే ఓ దడువాయి మృత్యుఒడికి చేరాడు. విద్యుత్ రూపంలో మృత్యువు కబలించింది. విగతజీవిగా పడి ఉన్న అన్న కొడుకును చూసిన బాబాయి.. అతడిని పట్టుకునే ప్రయత్నంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. పట్టణంలోని జ్యోతినగర్ కాలనీకి చెందిన జూకంటి మనీశ్(28) వ్యవసాయ మార్కెట్‌లో దడువాయిగా పని చేస్తున్నాడు. తన సొంత భూమిలో డెయిరీ ఫామ్ నిర్వహించడంతోపాటు (పాల వ్యాపారం) వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పొలం వద్ద పనులతోపాటు పశువుల వ్యర్థాలను తొలగించేందుకు ఇంట్లో చెప్పి తెల్లవారుజామున బయలు దేరాడు. పొలం పనులు చేసిన తర్వాత పశువుల పాకలో వ్యర్థాలను తొలగించే క్రమంలో కరెంట్ తీగ చేతికి తగలంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో బాబాయి జూకంటి శ్రీశైలం పక్కనే ఉన్న తన పొలంలో పని ముగించుకుని ఇంటికి బయలు దేరేందుకు సిద్ధమయ్యాడు. అన్న కుమారుడు మనీశ్ ద్విచక్రవాహనం చూసి ఇంకా ఇంటికి వెళ్లలేదని అతడిని పిలుస్తూ ముందుకు వెళ్లాడు. ఎంతకూ పలకకపోవడంతో దగ్గరకు వెళ్లే సరికి విగతజీవిగా పడి కనిపించాడు. తట్టి లేపే ప్రయత్నంలో కరెంట్ తీగలు గమనించి వెనక్కి తగ్గడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయగా వారు ఘటనాస్థలికి చేరకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. బిడ్డా మళ్లొస్తానంటూ వెళ్లి.. కానరానిలో కాలకు వెళ్లిపోయావా అంటూ గుండలవిసేలా రోదించారు. ఎస్సై రాజేశ్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తల్లిదండ్రులు యాదగిరి, ఉపేంద్ర తీర్థయాత్రలకు వెళ్లగా, కొడుకు చనిపోయిన వార్త తెలుసుకుని ఆయోధ్య నుంచి జనగామకు బయలు దేరారు.
మరొకరికి తప్పిన ప్రమాదం
జనగామలో ఘటన