టార్గెట్‌ 2.50 లక్షలపైనే.. | - | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ 2.50 లక్షలపైనే..

Published Thu, Apr 24 2025 1:54 AM | Last Updated on Thu, Apr 24 2025 1:54 AM

టార్గెట్‌ 2.50 లక్షలపైనే..

టార్గెట్‌ 2.50 లక్షలపైనే..

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : ‘బీఆర్‌ఎస్‌ 14 ఏళ్ల రాష్ట్ర సాధన పోరాటం, సాధించిన రాష్ట్రంలో పదేళ్ల అద్భుత పాలన.. పార్టీని తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలం చేశాయి. అలాంటి పార్టీ 25 సంవత్సరాల వేడుకలు నిర్వహించుకుంటున్నాం. సిల్వర్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు కనీవిని ఎరుగని రీతిలో ప్రజలు హాజరయ్యేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలి’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం ఎల్కతుర్తిలో రజతోత్సవ సభావేదిక ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన హనుమకొండ రాంనగర్‌లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంట్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాతికేళ్ల పండుగ సభకు ఉమ్మడి వరంగల్‌నుంచి 2.50 లక్షల మందికిపైగా హాజరయ్యేలా చూడాలని కోరారు. ప్రతీ నియోజకవర్గంనుంచి 25 వేల మందికి తగ్గకుండా.. ఉమ్మడి వరంగల్‌లోని ప్రతీ గడపనుంచి జనాలను కదిలించాలని సూచించారు. పార్టీ అధినేత కేసీఆర్‌ ఈ నెల 27న నిర్వహించే సభకు సాయంత్రం 4.30 గంటలలోపే చేరుకుంటారని, ఆలోగా ప్రజలు సభావేదిక వద్దకు చేరేలా ప్లాన్‌ చేయాలన్నారు.

ఒక్కొక్కరిగా జనసమీకరణపై ఆరా...

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్న ఈ సమీక్షసమావేశంలో జనసమీకరణపై ఇప్పటివరకు అమలు చేసిన కార్యాచరణపై నియోజకవర్గాల వారీగా కేటీఆర్‌ ఆరా తీసినట్లు తెలిసింది. ఈ మేరకు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న నేతలను అడిగి తెలుసుకున్న ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం. వాహనాల కొరత లేకుండా.. ట్రాఫిక్‌ సమస్య రాకుండా చూడడంతోపాటు జనం ఇబ్బందిపడకుండా చూడాలని, ఒక్కో వాహనానికి ఇన్‌చార్జ్‌ను నియమించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసమీకరణ, జనం తరలింపుపై ఫోన్‌ల ద్వారా సమీక్షించడం జరుగుతుందని, ఆందరూ తమ లక్ష్యాలను మించాలని కోరారు.

సభా ఏర్పాట్లపై అభినందనలు..

ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు తక్కువ సమయంలో ఏర్పాట్లు జరిగాయన్న కేటీఆర్‌.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సభ కోసం 1,250 ఎకరాలను ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ.. భూసేకరణ కోసం రైతులను ఒప్పించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌కుమార్‌, దాస్యం వినయ్‌భాస్కర్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఇతర నాయకులను అభినందించారు. సమీక్ష సమావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు డాక్టర్‌ బండా ప్రకాశ్‌, పోచంపల్లి శ్రీని వాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, శంకర్‌నాయ క్‌, నన్నపునేని నరేందర్‌, నాయకులు నాగూర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

జనసమీకరణపై నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం

ఓరుగల్లు ప్రతి ఇంటి నుంచి

జనం కదలాలే

సిల్వర్‌ జూబ్లీ వేడుకలు మళ్లీ మళ్లీ రావు... రజతోత్సవ సభ దద్దరిల్లాలని పిలుపు

సుమారు నాలుగు గంటల పాటు సమీక్ష... కీలక అంశాలపై చర్చ

సభా వేదిక, పార్కింగ్‌ స్థలాల ఏర్పాట్లపై అభినందనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement