
షాపింగ్ చేసి వస్తూ.. అనంతలోకాలకు..
కురవి : శుభకార్యం నిమిత్తం ఓ యువకుడు.. తల్లి, తమ్ముడితో కలిసి షాపింగ్ చేశాడు. అనంతరం బైక్‌పై వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని మొగిలిచర్ల సమీపంలో జరిగింది. కురవి ఏఎస్సై వెంకన్న కథనం ప్రకారం.. మండలంలోని రాజోలు శివారు పోలంపల్లి తండా గ్రామానికి చెందిన భూక్య ఈశ్వర్(17) మంగళవారం సాయంత్రం తన తల్లి సుజాత, తమ్ముడు ప్రభాస్‌తో కలిసి శుభకార్యం నిమిత్తం షాపింగ్ చేయడానికి బైక్‌పై మహబూబాబాద్ వెళ్లారు. షాపింగ్ పూర్తయిన అనంతరం మహబూబాబాద్ నుంచి మొగిలిచర్ల వైపునకు వస్తున్నారు. ఈ క్రమంలో అదే మార్గంలో ఓ కోళ్ల వ్యాన్ డోర్నకల్ వైపునకు వెళ్తోంది. మొగిలిచర్ల గ్రామంలోని పెట్రోల్‌బంక్ సమీపంలో కోళ్ల వ్యాన్ డ్రైవర్ సడన్‌బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న ఈశ్వర్ బైక్‌ను ఆపే ప్రయత్నంలో వ్యాన్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఈశ్వర్‌కు తీవ్రగాయాలు కావడంతో 108లో మాహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకన్న బుధవారం పేర్కొన్నారు.