గద్వాల రూరల్: నేనంటే గద్వాలలోని కొందరు నాయకులకు భయం.. అందుకే నేను మీటింగ్‌కు వస్తే కరెంట్ తీశారు.. నేను కుల, మత భేదాలు తెలియకుండా అందరి మధ్య పెరిగిన వ్యక్తిని. కానీ, నడిగడ్డలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇక్కడ కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఎస్సీలను ముట్టుకోరు.. దగ్గరకు రానీయరు.. ఇలాంటి పరిస్థితి ఎక్కడా చూడలేదు. ఇక్కడ రాజ్యాధికారం అంతా కొందరి చేతిలో బంధీ అయింది. ఇక్కడ జరుగుతున్న మీటింగ్‌కు చాలామంది రావాల్సి ఉన్నా.. కొందరు నాయకుల దౌర్జన్యానికి భయపడి రాలేకపోయారు. దీంతో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను కేవలం బానిసలుగా చూస్తున్నారు.. ఈ పరిస్థితి మారాలంటే మనకే రాజ్యాధికారం దక్కాలి.. ఇక్కడున్న వారికి ఎవరికి అవకాశం వచ్చినా నేను అండగా నిలబడతాను..
మీకోసం ఎదురెళ్లడానికి సిద్ధంగా ఉన్నా.. నాకు మీరు అండగా నిలబడాలి అంటూ జెడ్పీ చైర్‌పర్సన్ కె.సరిత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మల్దకల్‌లో నిర్వహించిన గద్వాల యువచైతన్య సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమే రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గద్వాలలో ఒక్కసారి బలహీన వర్గానికి చెందిన గట్టుభీముడికి అవకాశం వచ్చిందని, అన్న భీముడు అన్ని వర్గాలకు అండగా నిలబడ్డాడని, ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు సేవ చేస్తూ అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. మన ఓటు మనమే వేసుకుందామని, మనల్ని మనమే గెలిపించుకుందామన్నారు. మార్పు ఒక్కరితోనే మొదలవుతుంది.
ఆ ఒక్కరు నేనై మొదలుపెడతానని, నాకు మీరంత అండగా నిలబడాలని కోరారు. గద్వాలలో మనల్ని అణచివేతకు గురిచేస్తున్నారని, అందుకే మిమ్మల్ని పదే పదే అడుగుతున్నా.. ముఖ్యంగా యువత చెబుతున్నా.. మీరు ఇక్కడికి రాకపోవడానికి రకరకాల భయాలే కారణమని తెలుసు.. కానీ, నేను చెప్పేది మీరు కచ్చితంగా వింటారు. ఎందుకంటే ఫేస్‌బుక్‌లో ఎంతమంది నన్ను ఫాలో అవుతారో నాకు తెలుసు. చదువుకున్న యువత ముందుకు రావాలి. ఎన్నికల సమయంలో మీకు క్రికెట్ టోర్నమెంట్ అంటూ పక్కదోవ పట్టించి మోసం చేసేందుకు ఇక్కడి కొందరు నాయకులు కుయుక్తులు పన్నుతారు.
వారి కుతంత్రాలకు మోసపోకుండా చైతన్యులు కావాలి. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. వెనకబడ్డ జాతులు బాగుపడటానికి ముందుకొచ్చిన నాయకుడికి నేను అండగా ఉంటా.. నాకు మీరు అండగా ఉండాలి. నా దృష్టిలో రెండే కులాలున్నాయి. ఒకటి మంచితనం, రెండు చెడుతనం. జనాలకు మేలు చేసే కులం అగ్రకులమైతది కానీ, తెల్లబట్టలు వేసుకుని జనాలకు కీడు చేసుకుంటూ హింసిస్తూ నేను అగ్రకులస్తుడిని అంటే సరిపోదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో పాల్గొన్న పలువురు వక్తలు ఈసారి అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే టికెట్ ఇవ్వాలని డిమాండు చేశారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో బీసీ బలమేంటో చూపిస్తాం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment