మహబూబ్‌నగర్: విహారయాత్రకు వెళ్లి సరదాగా గడిపిన ముగ్గురు స్నేహితులు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. వాహనాన్ని అతివేగంగా నడపడం వల్ల ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల సమీపంలో చోటుచేసుకుంది.
వివరాలిలా.. ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ షుకూర్(55), షేక్ బాషా(58), పాకాలపాడుకు చెందిన అంజయ్య కలిసి డ్రైవర్ ప్రశాంత్‌కుమార్‌తో ఈ నెల 22న సత్తెనపల్లి నుంచి కారులో గోవాకు విహారయాత్రకు వెళ్లారు. గోవా నుంచి బుధవారం అర్ధరాత్రి 2 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మక్తల్ మండలం గుడిగండ్ల శివారులో మక్తల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని వెనక నుంచి వేగంగా ఢీకొట్టడంతో కారు చొచ్చుకుపోయింది.
ఈ ప్రమాదంలో షుకూర్, షేక్‌బాషా అక్కడికక్కడే మృతిచెందారు. కారులో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో చుట్టపక్కల వారు అక్కడికి చేరుకుని బయటకు తీశారు. కాళ్లు, చెయ్యి విరిగి తీవ్రగాయాలపాలైన అంజయ్యను మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మహబూబ్‌నగర్‌కు తరలించారు. డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు.
కేసు నమోదు..
షుకూర్‌కు ఓ సినిమా థియేటర్ ఉండగా.. షేక్‌బాషాకు బేకరి ఉంది. వీరంతా ప్రతి సంవత్సరం గోవాకు వెళ్లి వచ్చేవారు. అయితే ఈసారి మాత్రం రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.
షుకూర్‌కు భార్య షేక్ ఆరిఫ్, కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. షేక్‌బాషాకు భార్య రఫియా సుల్తానా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సత్తెనపల్లి నుంచి మక్తల్‌కు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పర్వతాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment