Telangana News: తెలంగాణ కాదు.. దేశం రూపురేఖలు మార్చే ఎన్నికలివి..!
Sakshi News home page

Narayanpet: తెలంగాణ కాదు.. దేశం రూపురేఖలు మార్చే ఎన్నికలివి..!

Published Mon, Nov 20 2023 1:32 AM | Last Updated on Mon, Nov 20 2023 11:26 AM

- - Sakshi

రూపురేఖలు మార్చే ఎన్నికలివి..
‘మిత్రులారా.. మొట్టమొదటగా ఈ ప్రాంత మాతా మాణికేశ్వరి అమ్మవారికి నమస్కరిస్తున్నా.. అభ్యర్థుల పేర్లు ఏదైతే చెప్పినప్పుడు హర్షధ్వానాలతో స్వాగతించారో.. అప్పుడే పూర్తిగా నాకు నమ్మకం ఏర్పడింది. కచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారని.. ఎమ్మెల్యేలను గెలిపించి తెలంగాణ శాసనసభకు పంపించడమే కాకుండా.. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌తో పాటు దేశం రూపురేఖలు మార్చే ఎన్నికలివి’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా అన్నారు.

ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలనను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజలందరూ ఒక్కసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

నారాయణపేట: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనేతలు వరుసగా ఉమ్మడి పాలమూరు జిల్లా బాట పట్టారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ నారాయణపేట, మహబూబ్‌నగర్‌ కు వచ్చి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గద్వాలలో జరిగిన సభలో శనివారం పాల్గొనడంతో కార్యకర్తల్లో కదనోత్సవం కనిపిస్తోంది. ఆదివారం నారాయణపేటలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించడంతో బీజేపీ శ్రేణులకు మరింత ఉత్సాహం వచ్చినట్లయింది.

జాయమ్మ చెరువుకు నీళ్లేవీ?
పాలమూరు– రంగారెడ్డి ద్వారా నీళ్లు తెచ్చి జాయమ్మ చెరువు నింపుతామన్న పాలకులు ఇప్పటివరకు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌రెడ్డి అన్నారు. నారాయణపేట ఎప్పటికై నా బీజేపీ గడ్డ అని.. ఓడినా.. గెలిచినా రతంగ్‌ పాండురెడ్డి ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటారన్నారు. కొత్తగా కాంగ్రెస్‌ నాయకులు వస్తున్నారు.. పెద్ద పెద్ద మాటలు చెబుతుండ్రు.. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఐదు గ్యారంటీలు చూడండి.. ఏమైనా అమలవుతున్నాయా.. అన్నీ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.

సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఐదారు లక్షల కోట్లు అప్పు చేశారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలు చేస్తారో ఒక్కసారి ఆలోచించాలన్నారు. గతంలో ఎంపీగా సైనిక్‌ స్కూల్‌ను నారాయణపేటకు తీసుకువచ్చా.. 50 ఎకరాల ప్రభుత్వ భూమిని చూయించినా ఇప్పటి వరకు ఆ స్కూల్‌ ఏమైందో ఎమ్మెల్యే చెప్పాలన్నారు. ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండే రతంగ్‌పాండురెడ్డితోపాటు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ వస్తే బూడిదే.. 
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పారీ్టలు ఒకరిని మించి ఒకరు మేనిఫెస్టోలను ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆ రెండు పారీ్టలు ఏకమై డ్రామాలు చేస్తున్నాయని, కేసీఆర్‌ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మనకు బూడిదే మిగులుతుందని ధ్వజ మెత్తారు.

సీఎం కేసీఆర్‌తోపాటు ఇక్కడ పోటీ చేసే నాయకులకు  ఓటు అడిగే హక్కు లేదన్నా రు. నారాయణపేటకు జూరాల బ్యాక్‌వాటర్‌ ద్వారా పాలమూరు – రంగారెడ్డి నీళ్లు ఇవ్వాలని మొదటగా డిజైన్‌ చేసి తర్వాత డిజైన్‌ మార్చి నారాపూర్‌ దగ్గరకు తీసుకువెళ్లినా.. ఇప్పటి వరకు సాగునీరు        అందలేదన్నారు. ఫలితంగా స్థానికులు బతుకుదెరువు కోసం సోలాపూర్, బొంబాయి ప్రాంతాలకు వలస పోతున్నారని ఆరోపించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నారాయణపేటలో రతంగ్‌పాండురెడ్డి, మక్తల్‌లో జలంధర్‌రెడ్డి, కొడంగల్‌లో బంటు రమేశ్, దేవరకద్రలో కొండా ప్రశాంత్‌రెడ్డిలను గెలిపించాలని ఓటర్లను కోరారు. 

♦సాధారణ కార్యకర్త అయిన నాకు టికెట్‌ ఇవ్వడం అంటే అది బీజేపీ గొప్పతనం అని, కొడంగల్‌ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు స్థానికేతరులు అయితే.. నేను లోకల్‌ అని కొడంగల్‌ బీజేపీ అభ్యర్థి బంటు రమేశ్‌ అన్నారు.ఈ ప్రాంతానికి సాగునీరు అందించడమే తన లక్ష్యమని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. 

♦రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ నియంత పాలనకు చరమగీతం పాడి రాష్ట్రంలో బీజేపీని ఆదరించి అధికారంలోకి తీసుకురావాలని దేవరకద్ర అభ్యర్థి కొండా ప్రశాంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, మరోదిక్కు ఆరు గ్యారంటీల పేరుతో వస్తున్న కాంగ్రెస్‌ పార్టీ పట్ల 
సకలజనులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

♦ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరికీ ఉచిత వైద్యం, విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే అమలు చేస్తుందని మక్తల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి అన్నారు. రైతులకు వరి ధాన్యానికి క్వింటాకు మద్దతు ధర రూ.3,120 గొప్ప విషయమన్నారు. 

♦ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా  పోటీ చేసి ఓడిపోయా.. గెలిచిన అభ్యర్థి పాలన ఏ విధంగా ఉందో చూశారు.. ఈసారి తనకు ఒక్క చాన్స్‌ ఇచ్చి ఆశీర్వదించాలని నారాయణపేట అభ్యర్థి రతంగ్‌పాండురెడ్డి ప్రజలను కోరారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఇంటింటికో ఉద్యోగం, సాగునీరు, దళితులకు మూడు  ఎకరాల భూమి ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు.  

కార్యక్రమంలో ఓబీసీ జాతీయ అధ్యక్షుడు    లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ, పార్లమెంట్‌ కనీ్వనర్‌ పవన్‌కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు పడాకుల శ్రీనివాసులు, నాయకులు  చంద్రశేఖర్, సత్యయాదవ్, రఘురామయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement