
ఈ జాగ్రత్తలు అవసరం..
మహబూబ్‌నగర్ క్రైం: పదో తరగతి.. ఇంటర్ పరీక్షలు ఇప్పటికే ముగిశాయి.. విద్యార్థులకు సెలవులు సైతం ఇచ్చారు. దీంతో వేసవి సెలవుల్లో పిల్లలు ఈత నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. అలాంటిది జిల్లాలో ఈత రాక ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఈ మధ్యకాలంలో స్విమ్మింగ్ పూల్స్‌లలో కూడా ప్రమాదవశాత్తు పడి మృతి చెందుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బౌగోళికంగా చూస్తే వాగులు, వంకలు, నదులు, కాల్వలకు కొదువ లేదు. దీంతో ఈ మధ్య ప్రాజెక్టుల కోసం, మిషన్ భగిరథ, మైనింగ్ గుంతలలో నిలిచిన నీటిలో ఈత కోసం వెళ్తున్నారు. దీంతో ప్రమాదవశాత్తు వాటిలో మునిగి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు.
బావులు, చెరువుల వద్ద
రక్షణ చర్యలు కరువు.
మండు వేసవిలో ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి.. సెలవుల సరదాతో కాలక్షేపం కోసం ఈతకు వెళ్లడం అందరికీ అభిరుచిగా మారుతోంది. జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో ఈత సరదా తీర్చుకునేందుకు అనువుగా స్విమ్మింగ్ ఫూల్స్ వెలిసినా ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, యువకులు ఆయా ప్రాంతాల్లో ఉండే బావులు, కుంటలు, చెరువులు, కాల్వలను ఆశ్రయిస్తున్నారు. చాలా మందికి ఈత కొట్టడం ఎలాగో తెలియక ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. రక్షణ చర్యల్లేక ఈత మాటున నిండు ప్రాణాలను పోగొట్టుకొని కన్నవారి కడుపుకోత మిగులుస్తున్నారు. వేసవిలో బాలలు, యువకులు జిల్లాలో ఈతకు వెళ్తూ నీటిలో మునిగి మృత్యువాత పడుతున్న సంఘటనలు ఏటా జరుగుతున్నాయి. నీటిలోతు, ఈత కొట్టే పద్ధతులు తెలియక అందులో మునిగిపోతుండగా రక్షణ చర్యలు కరవయ్యాయి.
ఆపద నుంచి రక్షించడం ఇలా..
ప్రత్యక్ష పద్ధతి ద్వారా నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించే వీలుంటుంది. అయితే రక్షించబోయే వ్యక్తికి ఈత రావడంతో పాటు ధైర్యం కలిగి ఉండాలి. నీటిలో మునుగుతున్న వ్యక్తి వెనుక నుంచి వెళ్లి అతని వెంట్రుకలు, అండర్‌వేర్, మొలతాడు వంటి వాటిల్లో ఏదో ఒకటి పట్టుకొని ఒడ్డుకు తీసుకురావాలి.
● పరోక్ష పద్ధతి విషయానికి వస్తే ఈత వచ్చిన వారితో పాటు రాని వారు కూడా నీటిలో మునుగుతున్న వారిని రక్షించవచ్చు. రక్షించే వారు నీటిలోకి దిగకుండా ఒడ్డున ఉండే ప్రమాదంలో చిక్కుకున్న వారికి ఆసరాగా ఒడ్డునుంచే దేన్నైనా పట్టుకునేలా కర్ర, టవల్, ఫ్యాంట్ వంటివి అందించాలి. దూరంగా ఉంటే తాడు, పొడవాటి కర్రను అందించి ఒడ్డుకు చేర్చాలి. నీటిపై తేలియాడే పరికరాలను నీటిలోకి విసిరి వేయాలి.
● నీటిలో పడి ప్రమాదానికి గురైన వ్యక్తిని ఒడ్డుకు చేర్చగానే అతన్ని వెల్లకిలా పడుకోబెట్టాలి. అవసరమైతే నోట్లో నోరు పెట్టి శ్వాస ఊదుతూ కృత్రిమ శ్వాస అందించాలి. చాతిపై చేతులతో ఒత్తాలి. దీంతో శ్వాస పెరుగుతుంది. ప్రథమ చికిత్స చేస్తూనే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలి.
వేసవి సరదాలతో విద్యార్థులకు పొంచి ఉన్న ముప్పు
అవగాహన లేక ప్రాణాలు కోల్పోతున్న వైనం
దేవరకద్ర సమీపంలో బావిలో మునిగి ఇద్దరు యువకుల మృతి
తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటిస్తే మేలు
Comments
Please login to add a commentAdd a comment