కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
చిన్నంబావి: స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ) పదో తరగతి విద్యార్థి మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సిబ్బంది తెలిపిన వివరాలు.. వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘనపూర్ మండలంలోని రుక్కన్నలపల్లితండాకు చెందిన శ్రీలత(15) కేజీబీవీలో పదో తరగతి చదువుతుంది. సోమవారం ప్రతిజ్ఞ కార్యక్రమానికి హాజరుకాకపోవడాన్ని సిబ్బంది గమనించారు. క్లాస్‌రూంలోకి వెళ్లి చూడగా బాలిక చేతిలో జ్వర మాత్రల స్లిప్ ఉంది. వెంటనే ఇన్‌చార్జి ఎస్‌ఓ ప్రశాంతికి సమాచారం అందించారు. హుటాహుటిన వీపనగండ్లలోని ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమయానికి ఆస్పత్రికి తరలించడంతో విద్యార్థిని పరిస్థితి మెరుగుపడిందని సిబ్బంది తెలిపారు. అసలు బాలికకు అన్ని మాత్రలు ఎలా వచ్చాయని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పలువురు విద్యార్థుల బంధువులు ఆరోపిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
తెలకపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని మదనాపురం గేట్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని రాకొండకు చెందిన పొట్టే పెద్ద పర్వతాలు (60) ద్విచక్ర వాహనంపై పెద్దూరు నుంచి తెలకపల్లికి వస్తుండగా.. మదనాపురం గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న మినీ డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన అతడిని స్థానికులు 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
రెండు బైక్‌లు ఢీకొని మరొకరు..
మల్దకల్: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన సోమ వారం శేషంపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నందికర్ కథనం మేరకు.. మద్దెలబండకు చెందిన కుర్వ ఈరన్న (38) వ్యవసాయ పనుల నిమిత్తం అయిజకు వెళ్లి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో అమరవాయికి చెందిన ఎరుకలి నర్సింహులు తన బైక్‌పై తాటికుంటకు వెళ్తుండగా మార్గమధ్యం శేషంపల్లి సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈర న్న అక్కడికక్కడే మృతిచెందగా, నర్సింహు లుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి అటు నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈరన్నకు భార్య సవారమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
ఆరు తులాల
బంగారం చోరీ
అయిజ: పట్టపగలు ఆరు తులాల బంగారం చోరీకి గురైన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మేండికొండ గ్రామానికి చెందిన వీరేష్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్‌లో తనఖా పెట్టిన 6 తులాల బంగారాన్ని సోమవారం వెనక్కి తీసుకొని ఒక కవర్‌లో ఉంచి తన మోటార్ సైకిల్‌లోని ట్యాంక్ కవర్‌లో పెట్టాడు. అనంతరం ఫర్టిలైజర్‌కు సంబంధించిన అప్పు చెల్లించేందుకు షాపుకు ముందు బైక్ పెట్టి లోపలికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూస్తే బంగారం కనపడలేదు. ఈవిషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment