దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి పరీక్షలు
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ (కేజీబీవీ, గురుకుల) పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ మేరకు ప్రతి పాఠశాలలో పదేళ్ల నుంచి 19 ఏళ్ల వయసు కల్గిన బాల బాలికలకు కంటి స్క్రీనింగ్ నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిలో భాగంగా సోమవారం నుంచి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని కంటి విభాగంలో విద్యార్థులకు వైద్యలు కంటి పరీక్షలు ప్రారంభించారు. మార్చి 2 నాటికి జిల్లాలోని 2,272 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్, ఆగస్టులో విద్యార్థులకు స్క్రీనింగ్ చేసిన అద్దాలు పంపిణీ చేయలేదు. ఈ ఏడాది గతంలో స్క్రీనింగ్ పూర్తి చేసి గుర్తించిన విద్యార్థులు అందరికీ మళ్లీ స్క్రీనింగ్ చేసి అద్దాలు పంపిణీ చేయడంతోపాటు సర్జరీ అవసరమైన విద్యార్థులకు హైదరాబాద్‌లోని సరోజనిదేవి ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించనున్నారు. మొదటి రోజు జిల్లావ్యాప్తంగా 287 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో మహబూబ్‌నగర్ పరిధిలో 184 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా వారిలో 181 మందికి అద్దాలు అవసరం ఉన్నట్లు గుర్తించగా మరో ముగ్గురికి సర్జరీ అవసరం కావడంతో సరోజనిదేవి ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఇక జడ్చర్లలో 103 మందికి కంటి పరీక్షలు చేయగా 99 మందికి అద్దాలు, నలుగురికి సర్జరీకి రెఫర్ చేయడం జరిగింది.
● దృష్టిలోపం ఉన్న విద్యార్థులు అందరికీ తప్పక కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు అందజేస్తామని డీఎంహెచ్‌ఓ కృష్ణ అన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కంటి పరీక్షల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సకాలంలో గుర్తించిన లక్ష్యంతోపాటు కొత్త విద్యార్థులకు కంటి పరీక్షలు పూర్తి చేయాలన్నారు. దృష్టిలోప సమస్య తీవ్రతను బట్టి అద్దాలను ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే సర్జరీలు అవసరమైన విద్యార్థులకు హైదరాబాద్‌లో చేయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఐవో పద్మజా, డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్, దేవిదాస్, దత్తు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment