హైటెక్ వ్యభిచారం !
మహబూబ్‌నగర్ క్రైం: పాలమూరులో కొత్త ట్రెండ్ వ్యభిచారం కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి విటులను ఆకర్షిస్తున్నారు. ఈ వ్యవహారమంతా వాట్సాప్‌లో డీల్‌చేసి చివరి తంతు అద్దె ఇళ్లలో పూర్తి చేస్తున్నారు. పాలమూరుతో పాటు జాతీయ రహదారి వెంట ఉన్న జడ్చర్ల, భూత్పూర్‌లో ఈ దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. కొన్నిచోట్ల పోలీసుల కన్నుసన్నల్లో.. మరికొన్ని చోట్ల గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు. కొందరు ఈ వృత్తిని జీవనోపాధి కోసం చేస్తుండగా.. మరికొందరిని డబ్బు ఆశజూపి ఈ రొంపులోకి దింపుతున్నారు.
ఎవరికి అనుమానం రాకుండా..
ఎవరికి అనుమానం రాకుండా నివాస గృహాలనే అడ్డాలుగా మార్చుకుంటున్నారు. జిల్లాకేంద్రంలో ఈ కేంద్రాలు అధికంగా ఉన్నట్లు సమాచారం. వాట్సాప్ వేదికగా ఈ వ్యాపారం నడిపిస్తూ సెల్‌ఫోన్‌లోనే బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. కొందరు గృహిణులను సైతం ప్రలోభాలకు గురిచేసే ఈ రొంపిలోకి లాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పచ్చటి కుటుంబాలు నాశనమవుతున్నాయి.
హైవే వెంట..
పాలమూరు, జడ్చర్ల, భూత్పూర్‌తో పాటు జాతీయ రహదారి వెంట ఉన్న రాయికల్, అడ్డాకుల టోల్‌ప్లాజా సమీపం, కావేరమ్మపేట, దివిటిపల్లి వంతెనతో పాటు మరికొన్ని చోట్ల ఈ దందా బాగానే సాగుతున్నట్లు సమాచారం. ఆర్థికంగా వెనుకబడిన మహిళలు కొందరు ఉండగా.. విలాసవంతమైన జీవితం కోసం మరికొందరు వృత్తిలోకి దిగుతున్నారు. జిల్లాకేంద్రంలో రోజు పదులసంఖ్యలో ఇళ్లు, హోటళ్ల గదులతో పాటు చిన్న చిన్న లాడ్జీల్లో ఈ దందా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తనిఖీలు నిర్వహిస్తున్నాం..
పట్టణంలో వ్యభిచారం, గంజాయి, పేకాట స్థావరాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. వ్యభిచారం జరుగుతుందని అనుమానం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నాం. కేంద్రాలు కొనసాగుతున్న ట్లు పోలీసులకు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇటీవల దివిటిపల్లి డబుల్ బెడ్‌రూం ప్రాంతంలో కార్డెన్‌సెర్చ్ నిర్వహించాం. వ్యభిచారం నిర్వహించే వారిపై కేసులు నమోదు చేస్తాం. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహబూబ్‌నగర్
వాట్సాప్ వేదికగా..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఈ దందా నిర్వహణకు వినియోగిస్తున్నారు. తొలుత వాట్సాప్‌లో మహిళల ఫొటోలను విటులకు పంపడం.. వాటిని చూసి నచ్చితే డీల్‌కు సిద్ధమవుతున్నారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడే సమయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జిల్లాకేంద్రంలోని పలు ప్రాంతాల్లో..
జిల్లాకేంద్ర సమీపంలోని రాజీవ్ స్వగృహ, హౌజింగ్‌బోర్డు, శ్రీరామకాలని, బైపాస్, శ్రీనివాసాకాలని, వేంకటేశ్వరకాలని, హబీబ్‌నగర్, రాజీవ్ గృహకల్ప, అశోక్ టాకీస్ ఏరియా, పాత బస్టాండ్‌తో పాటు పలు కాలనీల్లోని ఇళ్లల్లో ఈ దందా కొనసాగుతున్నట్లు సమాచారం. చుట్టుపక్కల ఇళ్లవారికి అనుమానం రాకుండా బంధువులంటూ పరిచయం చేస్తున్నారు. చాలా వరకు సొంత ఇళ్లలోనే ఈ దందా నడిపిస్తుండగా కొందరు అద్దె ఇళ్లలో కొనసాగిస్తున్నారు.
యువతులను సైతం..
కొందరు మహిళలు యువతులను సైతం ఈ వ్యాపారంలోకి దించుతున్నారు. హైదరాబాద్‌తో పాటు పల్లెల నుంచి వచ్చే కొందరు యువతులకు డబ్బు ఆశజూపి ఈ రంగంలోకి దించి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. మధ్యవర్తులే విపరీతంగా సంపాదిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని రూరల్, టూటౌన్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ వ్యభిచార కేంద్రాలు కొనసాగుతున్నాయి. పోలీసులకు సమాచారం ఉన్నా తేలిగ్గా తీసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
వాట్సాప్ వేదికగా జోరుగా దందా
నివాస గృహాలే అడ్డాలుగా..!
జిల్లాకేంద్రంతో పాటు
జాతీయ రహదారి వెంట
హైటెక్ వ్యభిచారం !
Comments
Please login to add a commentAdd a comment