ఒడిదుడుకుల ఉల్లి
దేవరకద్ర: ఉల్లి రైతు ఆటుపోటులను ఎదుర్కొనక తప్పడం లేదు. ఒక నెలలో తక్కువ ధర పలికితే మరో నెలలో చుక్కలనంటుతుంది. దిగుబడి పెరిగినప్పుడు రూ.వందల్లోకి.. తగ్గితే రూ.వేలల్లో ధరలు పలుకుతాయి. జిల్లాలో దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ ఉల్లి వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రతి బుధవారం ఇక్కడ ఉల్లి వేలం నిర్వహిస్తారు. స్థానిక వ్యాపారులతో పాటు ఇతర మార్కెట్ల వ్యాపారులు, లైసెన్సులు లేని చిరు వ్యాపారులు కూడా వేలంలో పాల్గొనే అవకాశం కల్పించారు. దీంతో ఉల్లి వ్యాపారం ప్రతి వారం జోరుగా సాగుతుంది. వ్యాపారులు కూడా ఆ ఒక్క రోజు ఉల్లి విక్రయాలకే ప్రాధాన్యం ఇస్తారు.
నిలకడ లేని ధరలు..
మహారాష్ట్ర, కర్ణాటకలో ఉల్లి దిగుబడులు పెరిగితే హైదరాబాద్ మార్కెట్‌లో ధర పడిపోతుంది. దిగుబడులు తగ్గితే ధరలు ౖపైపెకి ఎగబాకుతాయి. దీంతో దేవరకద్ర మార్కెట్‌లో కూడా ధరలు వారం వారం మారుతుంటాయి. ఓ సీజన్‌లో ధరలు ఆకాశాన్ని అంటితే.. మరో సీజన్‌లో ధరలు పాతాళానికి పడిపోతాయి.
● దేవరకద్ర మార్కెట్ చరిత్రలోనే 2020లో రికార్డు ధర నమోదైంది. ఆ ఏడాది అక్టోబర్ 28న జరిగిన వేలంలో క్వింటా ఉల్లి గరిష్టంగా ధర రూ.8,200, కనిష్టంగా రూ.7,000 ధర పలికింది. చిరు వ్యాపారులు అదే నెలలో కిలో రూ.100గా విక్రయించారు.
● 2021 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరిలో క్వింటా ఉల్లి ధరలు గరిష్టంగా రూ.3,800, కనిష్టంగా రూ.3,200గా నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమ క్రమంగా రూ.2,500కు దిగి వచ్చింది. యాసంగి సీజన్‌లో అధిక దిగుబడి రావడంతో రూ.1,200కు పడిపోయింది. ఏడాది చివరి వరకు రూ.2,800 నుంచి రూ.1,800 వరకు ధరలు పలికాయి.
● 2022 రూ.1,200 నుంచి రూ.4,000 వరకు పలికాయి. 2023లో జనవరి నుంచి మార్చి వరకు క్వింటా ఉల్లి రూ.1,200 నుంచి రూ.1,500 వరకు ధరలు నమోదయ్యాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.1,600 నుంచి రూ. 2,800 వరకు.. సెప్టెంబర్, అక్టోబర్‌లో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ధర పలికాయి. నవంబర్‌లో గరిష్టంగా రూ.6,020, కనిష్టంగా రూ.4,600గా నమోదయ్యాయి. డిసెంబర్ చివరి వరకు రూ.2 వేల నుంచి రూ.3,600 వరకు నమోదయ్యాయి.
● 2024 జనవరిలో దిగుబడి బాగా పెరగడంతో ధరలు బాగా పడిపోయాయి. ప్రారంభంలో క్వింటా రూ.1,000 నుంచి రూ.1,600 వరకు ఉండగా ఫిబ్రవరి నుంచి మే వరకు కనిష్టంగా రూ.900, గరిష్టంగా రూ.1,300 ధరలు వచ్చాయి. మే చివరలో రూ.2,800కి, జూన్‌లో రూ.2,500 నుంచి రూ.3,100 వరకు పలికాయి. జూలై, ఆగస్టులో రూ.3,650 నుంచి రూ.4,300.. సెప్టెంబర్‌లో గరిష్టంగా రూ.5,600 వరకు ధర వచ్చింది. అక్టోబర్‌లో కొత్త ఉల్లి రాకతో రూ.2400 నుంచి రూ.3,100 వరకు పడిపోయాయి. నవంబర్‌లో మళ్లీ పుంజుకొని గరిష్టంగా రూ.4,550, కనిష్టంగా రూ.2,600 పలికాయి. డిసెంబర్ ప్రారంభంలో రూ.4,750.. రెండో వారంలో రూ.5,100 ధర లభించింది.
● ఇక ఈ ఏడాది జనవరి నుండి ఉల్లి ధరలు అటు ఇటుగా పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. ప్రారంభంలో గరిష్టంగా రూ.4,100 వరకు ఉండగా కనిష్టంగా రూ.2,000 వరకు ధర వచ్చింది. ఈ నెలలో గరిష్ట ధర రూ. 2,800, కనిష్ట ధర రూ.1,800 వరకు పలికాయి. ప్రస్తుతం సీజన్ ప్రారంభం కావడం వల్ల ఉల్లి దిగుబడులు మార్కెట్‌కు ఎక్కువగా రావడంతో ధరలు తగ్గు ముఖం పట్టాయి.
ప్రతి ఏటా తగ్గుతూ పెరుగుతున్న ధరలు
2020లో రికార్డు ధర రూ.8,200 నమోదు
ప్రస్తుతం రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పలుకుతున్న ధర
ఒడిదుడుకుల ఉల్లి
ఒడిదుడుకుల ఉల్లి
Comments
Please login to add a commentAdd a comment